విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి

Jun 8,2024 20:49 #Dharna, #visaka steel plant
  • పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ప్రజల ఆకాంక్షను గుర్తెరిగి వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1213వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో సిఒ అండ్‌ సిసిపి విభాగం కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, విళ్లా రామ్మోహన్‌ కుమార్‌, శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజలు, కార్మికులకు మేలు చేకూర్చే నిర్ణయాలను కేంద్రంలోని సంకీర్ణ ప్రభుతం చేయాలని కోరారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని రాష్ట్ర పార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల్లో గెలిచిన భావ సారూప్యం కలిగిన పార్టీలకు మరోసారి పార్లమెంటు సమావేశాలకు ముందు విజ్ఞప్తి చేస్తామన్నారు. జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి ప్లాంటును చేర్చి, నిర్వీర్యం దిశగా కుట్రలు చేస్తున్న స్టీల్‌ యాజమాన్యం చర్యలను ఖండిస్తున్నామన్నారు. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, పూర్తిస్థాయి ఉత్పత్తి కోసం రూ.3500 కోట్ల వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చాలని డిమాండ్‌ చేశారు. ఉక్కు కార్మికులకు నూతన వేతన ఒప్పందం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో టి.కనకరాజు, ఎ.శివరామకృష్ణ, ఎస్‌కె.మొహిద్దీన్‌, ఎస్‌ఎస్‌.జగన్నాధరావు, నర్సింగరావు, పి.పెంటారావు పాల్గొన్నారు.

➡️