విశాఖ ఉక్కు రక్షణకు మరో విస్తృత పోరాటం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖ ఉక్కు ప్యాక్టరీ రక్షణకు మరో విస్తృత పోరాటానికి నడుం బిగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధ, గురువారాల్లో నిర్వహించారు. ఈ సమావేశాలకు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షత వహించగా, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఎ.బేబి, బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.

తీర్మానాలు ఇవి…

మిట్టల్‌ మీద ప్రేమ.. విశాఖ స్టీల్‌పై మతిమరుపు

ప్రధాని, సిఎం, డిప్యూటీ సిఎంలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ద్రోహం చేశారు. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో విశాఖ ఉక్కుకు అనుకూలమైన ప్రకటనలు చేస్తారని, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు చేయిస్తారని రాష్ట్ర ప్రజలు ఆశించారు. ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విశాఖ ఉక్కుకోసం పల్లెత్తు మాటనలేదు. ఇది నమ్మి గెలిపించిన విశాఖ, రాష్ట్ర ప్రజలను వంచించడమే. దీనిని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలి. కేంద్రంలో తమకున్న కీలక అనుకూల అంశాలను ఉపయోగించాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం ఆపించాలి. సెయిల్‌లో విలీనం చేయించి, స్వంత గనులు సాధించాలి. ఉద్యోగులకు, కార్మికులకు సకాలంలో జీతాలు సాధించాలి. నిర్వాసితులకు ఉద్యోగాలు సాధించే చర్యలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తోంది.
గత 35 ఏళ్ల నుండి సమర్ధవంతంగా నడుస్తున్న విశాఖ స్టీల్‌కు స్వంత గనులు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు. మరోవైపు ఇంకా స్థాపించని ఆర్సిలార్‌ మిట్టల్‌కు స్వంత గనులు ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరడం విశాఖ స్టీల్‌కు ద్రోహం చేయడమే. విశాఖ స్టీల్‌ను ప్రైవేటుకు కట్టబెట్టాలన్న కుట్ర స్పష్టం అవుతుంది. ప్లాంటు ఏర్పాటుకు నాటి ప్రభుత్వం రూ.4,890 కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు, డివిడెంట్లు రూపంలో రూ.54 వేల కోట్ల రూపాయలు ఆదాయం అందించింది. విశాఖ ఉక్కు. దేశంలో సముద్రతీర ప్రాంతంలోగల కీలక ప్లాంటు. నేడు రూ.3 లక్షల కోట్లు ఆస్థులు కలిగి ఉంది. తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.4 మిలియన్‌ టన్నుల నుండి 7.3 మిలియన్‌ టన్నులకు విస్తరించి, 20 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యానికి విస్తరించి, మరో 10 వేల ఉద్యోగాల కల్పనకు వనరులున్న ప్లాంటు ఇది. ప్రభుత్వరంగంలోని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వల్ల స్టీల్‌ ధరలు నియంత్రణలో ఉన్నాయి. లేని యెడల కార్పొరేట్లు స్టీల్‌ ధరలు పెంచుతారు. దీనివలన ప్రజల, ప్రభుత్వ వ్యయం భారీగా పెరుగుతుంది.

ఈ బంగారు బాతును కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్‌ సేల్‌ పేరున 100 శాతం తన అనుకూల కార్పొరేట్లకు అమ్మాలని నిర్ణయించింది. ఈ ప్రజాద్రోహ నిర్ణయానికి వ్యతిరేకంగా గత 4 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతోంది. అయినా మోడీ ప్రభుత్వం ప్లాంటును అష్టదిగ్బంధనం చేస్తోంది. విశాఖ ఉక్కు తప్ప దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్టీల్‌ ప్లాంట్లకు స్వంత ఇనుప గనులు కేటాయించింది. దీనివలన ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తికి వైజాగ్‌ స్టీల్‌కు అదనంగా రూ.4 వేలు అదనపు ఖర్చు అవుతోంది. మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లలో రెంటిని మాత్రమే నడిపిస్తోంది. పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడవనివ్వడం లేదు. సంస్థలో ఆఫీసర్లు, పర్మినెంటు, కాంట్రాక్టు కార్మికులకు గత నాలుగు నెలలుగా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. కార్మికుల జీతాల నుండి రికవరీ చేసిన ఇన్స్యూరెన్సు, సొసైటీ సొమ్మును జమచేయడం లేదు. పర్మినెంటు, కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు పూనుకుంటోంది. ప్లాంటును, కార్మికులను అన్ని విధాలుగా దెబ్బతీసి కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలు చేస్తోంది. గత వైసిపి ప్రభుత్వం మోడీ ప్రభుత్వ కుట్రలను ఎదిరించలేకపోయింది. సాగిలపడింది. టిడిపి, జనసేన కూటమి ప్రభుత్వ రంగంలో ప్లాంటును ప్రయివేటుకు అమ్మనివ్వం, అభివద్ధి బాటపట్టిస్తామని వాగ్దానం చేసింది. కానీ దీనికి విరుద్దంగా వ్యవహరిస్తున్నది. విశాఖ ఉక్కును ప్రక్కనపెట్టి అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్ఫెలార్‌ స్టీల్‌ప్లాంటుకు భూమి కేటాయించి, త్వరగా అనుమతులు, ఇనుప ఖనిజం అంతరాయం లేకుండా సరఫరా చేయాలని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన మంత్రిని కోరారు. ఇది విశాఖపట్నం, రాష్ట్ర ప్రజలకు విఘాతం కల్గించే చర్య.
మోడీ ప్రభుత్వ ద్రోహం, టిడిపి కూటమి అవకాశవాదంపై విశాఖ ఉక్కు కార్మికులు గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్న సమరశీల పోరాటాన్ని సిపిఎం అభినందిస్తూ, పోరాటం ఉధతం చేయాలని, విశాఖ, రాష్ట్ర ప్రజలు స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు మరో విస్తృత పోరాటానికి నడుం బిగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.

తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ

టిటిడి క్యూల్కెన్ల తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. కారకులను శిక్షించాలి. ఇందుకు టిటిడి పాలకమండలి బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీ చేసే కేంద్రాలలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. సుమారు 50 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇంతటి విషాదకర ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. కారకులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరుతుంది. చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తుంది.
తొక్కిసులాట ఘటనకు టిటిడి పాలక మండలి, జిల్లా అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి. పదిరోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచార ఆర్భాటం తప్ప పటిష్టమైన ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిసిస్తుంది. వైకుంఠ ఏకాదశిని పవిత్రంగా భావించి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా ఉన్నప్పటికీ అందుకు తగిన ఏర్పాట్లు చేయలేకపోయారు. 9 ప్రాంతాలలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బైరాగిపట్టెడ, మహాత్మాగాంధీ మున్సిపల్‌ స్కూలు వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణాలు ఎక్కువగా సంభవించాయి. యాత్రికులకు భోజనం, మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో టిటిడి అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
మరణించిన వారి కుటుంబాలకు టిటిడి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, క్షతగ్రాతులకు మెరుగైన వైద్యంతోపాటు రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

➡️