ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్ని నిర్వీర్యం చేయడం తగదని సిఐటియు సీనియర్ నాయకులు ఎన్ రామారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1386వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తిని తగ్గించి, కార్మికులను ఆర్థికంగా దెబ్బతీసి, ముడి సరుకు రాకుండా చేసి కర్మాగారాన్ని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. ఐక్య పోరాటాలతో కార్మికులంతా వాటిని తిప్పికొట్టాలని కోరారు. ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సొంత గనులు కేటాయించి, పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూడాలన్నారు.