Visakhapatnam: స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆపాలి : సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను నిలుపుదల చేస్తున్నట్టు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, రాష్ట్రం నుంచి కేంద్ర ఉక్కు సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బి.శ్రీనివాస్‌వర్మ ప్రకటించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. ఉక్కు నగరంలోని సిఐటియు కార్యాలయంలో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రయివేటీకరణ నిలుపుదల చేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కార్మికుల సుదీర్ఘ పోరాట ఫలితమే ఆ నిర్ణయమని పేర్కొన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోందని, దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, ఉక్కు సహాయ మంత్రి స్పందించాలని కోరారు. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాలని, పూర్తిస్థాయి ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని కోరారు. స్టీల్‌ యాజమాన్యం సకాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యాక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైటి.దాస్‌, యు.రామస్వామి తదితరులు ప్రసంగించారు.

➡️