- ఏప్రిల్ 16 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీ వద్దనున్న విజ్ఞాన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్‌లలో బిటెక్, బిఫార్మసీ, బిఎస్‌సి అగ్రికల్చరల్, ఫార్మా-డీ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్-2025 ఫేజ్ 1 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ పి.నాగభూషణ్ మాట్లాడుతూ..ఎపి, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యార్థులు వీశాట్‌కు హాజరైనట్లు చెప్పారు. వీశాట్-2025 ర్యాంకులతో పాటు జెఇఇ మెయిన్స్ ఫలితాలు, ఎంసెట్ ర్యాంకులు, ఇంటర్ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. వీశాట్‌లో ఒకటి నుంచి 50లోపు ర్యాంకులు సాధించిన వారికి 50 శాతం స్కాలర్‌షిప్, 51 నుంచి 200లోపు ర్యాంకులు సాధించిన వారికి 25 శాతం స్కాలర్‌షిప్, 201 నుంచి 2000 లోపు ర్యాంకులు సాధించిన వారికి పది శాతం స్కాలర్‌షిప్‌ను నాలుగేళ్లపాటు అందజేస్తామని వెల్లడించారు. గుంటూరు, హైదరాబాద్ క్యాంపస్ యూనివర్సిటీలో ప్రవేశాలకు ఈనెల 16 నుంచి 20 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. విశాట్ ఫేజ్-2 ప్రవేశ పరీక్షలను ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకూ నిర్వహిస్తామని చెప్పారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డీన్ అడ్మిషన్స్ డాక్టర్ కేవీ కృష్ణకిషోర్ మాట్లాడుతూ.. విశాట్ ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ https://vignan. ac.in/vsatresult లో అందుబాటులో ఉంచామని తెలిపారు. విద్యార్థుల సెల్‌ఫోన్లకు ర్యాంకులు వివరాలను పంపిస్తామని చెప్పారు. విశాట్‌లో మొదటి పది ర్యాంకులు వరుసగా కే.రవితేజ ( అనంతపురం), నాగేండ్ల సస్వత్ ప్రణరు (నరసరావుపేట), ఆర్.సాయితేజ (వరంగల్), కే.మహేష్( విశాఖపట్నం), కే.ప్రియతం కార్తీక్( విజయవాడ), ఏ.సాయిసంతోష్‌రామ్ ( ఏలూరు), కొప్పుల హర్షిల్ (కృష్ణా జిల్లా), ఏ. దేవిశ్రీచరిత్ (మార్టూరు), షేక్ సమీర్‌బాబు (గుంటూరు), యూ.డోలామణి సత్యనాగశంకర్ (రాజోలు) సాధించారన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్.రఘునాధన్ తదితరులు పాల్గొన్నారు.