- విజయనగరం, శ్రీకాకుళంలో పాడి రైతుల ఆందోళన
ప్రజాశక్తి-యంత్రాంగం : విశాఖ డెయిరీ పాల సేకరణ ధరను తగ్గించడాన్ని నిరసిస్తూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పాల రైతు సంఘం ఆధ్వర్యంలో పాడి రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తగ్గించిన పాల సేకరణ ధరను తక్షణమే పెంచాలని, ఏడాదికి మూడుసార్లు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట ధర్నాలో ఎపి పాల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రాంబాబు మాట్లాడుతూ.. డెయిరీ నుంచి ఉత్పత్తి అయ్యే పాల సంబంధిత పదార్థాల ధరలు పెరుగుతుంటే, పాలు పోసే రైతుకు ఇచ్చే ధర తగ్గించడం సరికాదన్నారు.
డెయిరీ యాజమాన్యం ఆవు పాలు సేకరణ 10 శాతం తగ్గించిందని, అంతకుమునుపే నవంబర్‌లో సేకరణ ధర లీటరుకు రూ.4 తగ్గించిందని తెలిపారు. పాల రైతులను నష్టపరుస్తూ రైతులను నిండా ముంచుతోందన్నారు. పెరిగిన పశు పోషణ ఖర్చుల భారం రైతు భరిస్తూ సెంటర్‌కు పాలు పోస్తున్న రైతులకు న్యాయమైన ధర అందించాల్సిన బాధ్యతను విస్మరించి డెయిరీ యాజమాన్యం సహకార రంగం స్ఫూర్తికి భిన్నంగా నడుస్తోందని విమర్శించారు. విశాఖ డెయిరీ నేడు స్వార్ధపరుల అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. సుదీర్ఘకాలం డెయిరీ యాజమాన్యం బాధ్యతల్లో ఉన్న ఆడారి కుటుంబం తనకు ఉన్న మంది బలంతో సహకార రంగాన్ని వీడి కంపెనీ చట్టంలోకి డెయిరీని మార్చుకున్నారన్నారు.
దీంతో ప్రభుత్వం పర్యవేక్షణ నుండి తప్పించుకొని అవినీతికి శ్రీకారం చుట్టి డెయిరీ ఆస్తులను లూటీ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం విశాఖ డెయిరీపై వేసిన కమిటీ విచారణను వేగవంతం చేసి దోషులను శిక్షించాలని, డెయిరీ ఆస్తులను కాపాడాలని కోరారు. డెయిరీని కంపెనీ చట్టం నుండి సహకార చట్టంలోకి మార్చాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట ధర్నాలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పొందూరు చంద్రరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలమల రమణ, పోలాకి ప్రసాదరావు, బగాది వాసు మాట్లాడుతూ.. డెయిరీ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని పాల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.