కార్పొరేట్ల కోసమే ‘విజన్‌’

  • రాష్ట్ర ప్రజలను భ్రమల్లో ముంచుతున్నారు
  •  స్వర్ణాంధ్రఏ 2047 సమాలోచనలో వి.శ్రీనివాసరావు
  • ఇదో కనికట్టు లాంటిది
  • సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాయితీల పేరుతో కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలను దోచిపెట్టడానికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్‌ 2047 అంటున్నారని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘స్వర్ణాంధ్ర విజన్‌ 2047’పై గురువారం ఉదయం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సమాలోచన కార్యక్రమం జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ, సిపిఎం నాయకులు కె.ప్రభాకరరెడ్డి, సిహెచ్‌.నరసింగరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాదుతూ స్వర్ణాంధ్ర విజన్‌ 2047 పేరుతో చంద్రబాబునాయుడు ప్రజలను భ్రమల్లో ముంచి మబ్బుల్లోకి తీసుకెళుతున్నారని విమర్శించారు. అదే సమయంలో సహజ వనరులన్నీ కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నారని, రాయితీల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచిపెడతారని విమర్శించారు. గతంలో అట్లహాసంగా చెప్పిన విజన్‌ 2020పై ఇంతవరకు సమీక్ష లేదని, మరోసారి 2047 విజన్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వీటివల్ల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు ఏమీ ఉండటం లేదని చెప్పారు. గతంలో తీసుకువచ్చిన విజన్‌ 2020 విఫలమైందని, విజన్‌ పూర్తయ్యే నాటికి రాష్ట్ర జిడిపి సగటున సంవత్సరానికి 10 శాతానికి తీసుకెళతామని చెప్పారని, వాస్తవంగా సాధించింది 5.2 శాతం మాత్రమేనని చెప్పారు. ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పేర్కొన్న విజన్లో పేదరికం లేని సమాజం, ఉపాధి, నైపుణ్యం, నీటి వనరులు, ఆధునిక వ్యవసాయం, రవాణా, లాజిస్టిక్స్‌, తక్కువ ఖర్చుతో విద్యుత్‌, ఆధునిక పద్ధతుల్లో ఉత్పత్తి, స్వచ్ఛాంధ్ర అనే అంశాలను ప్రస్తావించారని తెలిపారు. రాష్ట్రంలో విజన్‌ 2020 ప్రకటించిన తరువాత 20 ఏళ్లలో పది సంవత్సరాలు చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పటి వరకూ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని, కొత్తగా పిపిపి స్థానంలో పి4 తీసుకొచ్చారని విమర్శించారు. ఇక ముందు అన్నిట్లోనూ ప్రజల భాగస్వామ్యం పేరుతో ప్రజల ఉమ్మడి ఆస్తులను దోచుకోవడానికి పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారని వివరించారు. 2047 నాటికి పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన దేశంగా చేస్తామని చెబుతున్నారని 20 ఏళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదని, రాబోయే 23 ఏళ్లలో ఏం సాధిస్తారని ప్రశ్నించారు.గత దశాబ్ధ కాలంలో నిజ వేతనాలు కూడా 0.4 శాతం తగ్గాయని, ప్రజల ఆదాయాలూ తగ్గుతున్నాయని వివరించారు. అక్రమాలకు కేంద్రంగా పాలన సాగుతోందని, ఆదానీ కుంభకోణంలో ఇప్పటి వరకూ సెకీ నివేదికలు తెప్పించుకోలేదని విమర్శించారు. అమెరికా న్యాయ విభాగం కేసు నమోదు చేసినా ప్రధానిలో చలనం లేదని, అటువంటి వ్యక్తుల పాలనలో దేశం ఏమి అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు.

నెల క్రితం ఒక అంశాన్ని అధ్యయనం చేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు చేతులెత్తేశారని విమర్శించారు. ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపిన జగన్‌ను విమర్శించినందువల్ల ప్రయోజనం లేదని, చార్జీలు తగ్గించాలని, సెకీ ఒప్పందాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మెగా డిఎస్‌సి కింద ఉద్యోగాలు ఇస్తామని మొదటి సంతకం చేశారని, ఇప్పటి వరకూ దానికి అతీగతి లేదని, ఇప్పుడు విజన్‌ పేరుతో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ నిరుద్యోగ యువతను మభ్యపెడుతున్నారని అన్నారు. ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు లాంటి సంస్థలను అమ్మేస్తున్నారని, ప్రైవేటు రంగంలో మిట్టల్‌ స్టీలును తీసుకొస్తున్నారని తెలిపారు. విశాఖలో ఆదానీ డేటా సెంటర్‌ ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదని వివరించారు. ఇలాంటి బూటకపు విజన్లు మాని ఐదేళ్లలో ఎంతవరకు చేయగలరో అంతే చెప్పి వాటిని కొనసాగించాలని సూచించారు. నివాస ప్రాంతంలోనే పని సౌకర్యం ఏర్పాటు ఇప్పటికే కేరళలో ప్రారంభమైందని, అక్కడ విజయవంతంగా నడుస్తోందని తెలిపారు. డ్వాక్రా సంఘాల్లో మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్లను చేస్తామని చెప్పడం ద్వారా ఉపాధి కల్పించే ఆలోచన నుండి ప్రభుత్వం తప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవనరుల ప్రాజెక్టుల పేరుతో వేలకోట్ల విలువైన ప్రణాళికలు రూపొందిస్తున్నారని, అతి తక్కువ మొత్తంలో పూర్తయ్యే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులను అలాగే వదిలివేస్తున్నారని చెప్పారు.

మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ మాట్లాడుతూ 2047 నాటికి రెండు ట్రిలియన్ల ఎకానమీకి తీసుకెళతానంటున్నారని, అంటే 23 సంవత్సరాల్లో రాష్ట్ర ఎకానమీ 12 రెట్లు పెరగాల్సి ఉందని అది సాధ్యమయ్యేది కాదని ఇప్పటి వరకూ ఉన్న అనుభవాలు చెబుతున్నాయని వివరించారు. విజన్లో ఎక్కడా ప్రజాస్వామ్యం ప్రస్తావన లేదని, సహకార వ్యవస్థ మాటే లేదని తెలిపారు. వికేంద్రీకరణ చేయాలనే ఆలోచన, కనీస వేతనాల గ్యారంటీ అనే అంశాలేవీ విజన్లో కనిపించడం లేదని, ఇది పూర్తిగా ప్రజావ్యతిరేక విజనని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర అంశమే కనిపించడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు అనుసరిస్తున్న తీరు ప్రజాచైతన్యంపై రాజకీయ సైద్ధాంతిక దాడని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ విజన్‌ పేరుతో రైతులను, వ్యవసాయాన్ని చంద్రబాబు దెబ్బకొడుతున్నారని తెలిపారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ప్రైవేటు మత్తు ఎక్కిందని, రాష్ట్రాన్ని దోచిపెట్టడం తప్ప ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన విజన్లో కనిపించడం లేదని తెలిపారు. వక్తలను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.హరికిషోర్‌ వేదిక మీదకు ఆహ్వానించారు.

విద్యుత్‌ ఛార్జీలపై ఆందోళన

పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, సెకీతో ఒప్పందాలు రద్దు చేయాలని, ట్రూఅప్‌ చార్జీల విధానాన్ని రద్దు చేయాలని, స్మార్ట్‌ మీటర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 7వ తేదీన విజయవాడలో 10వ తేదీన కర్నూలులో ఎపిఇఆర్‌సి వద్దకు సామూహిక రాయబారాలు నిర్వహించనున్నట్లు శ్రీనివాసరావు ప్రకటించారు. యం.బి.విజ్ఞాన కేంద్రంలో తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ పెంచిన విద్యుత్‌ బిల్లులను జనవరి 13 భోగి మంటల్లో దహనం చేయనున్నట్లుగా ప్రకటించారు. ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

➡️