చల్లపల్లిలో రైతు సంఘం నాయకుల పర్యటన

Sep 4,2024 07:23 #ap rythu sangham

దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన
 పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్‌
ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా జిల్లా) : ఇకెవైసితో సంబంధం లేకుండా రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండల పరిధిలోని వెలివోలు, నిమ్మగడ్డ, నడకుదురు గ్రామాల్లో ఎపి రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు మంగళవారం పర్యటించారు. నీట మునిగిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట రుణాలను మాఫీ చేయాలని, ఈ క్రాప్‌ చేసిన నకలు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణానది వరద ఉధృతికి పంట నష్టపోయిన రైతులకు ఎరువులు, విత్తనాలు రాయితీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చల్లపల్లిలోని పునరాస కేంద్రంలో ఉన్న అమ్ముదారులంక గ్రామస్తులను పరామర్శించారు. సర్వసం కోల్పోయి పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న వ్యవసాయ కార్మికులకు రూ.10 వేలు తక్షణ సాయంగా అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు, ముర్రాపు సూర్యనారాయణ, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️