విజయనగరం ఎంఎల్‌సి ఉపఎన్నిక రద్దు

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉపఎన్నిక రద్దయింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్లు ఎన్నికల కమిషన్‌, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ నుంచి ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది. గత ప్రభుత్వంలో వైసిపి తరపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు ఎన్నికయ్యారు. కాలపరిమితి ప్రకారం ఆయన 2027 నవంబర్‌ 31 వరకు కొనసాగాల్సి ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆయనపై అదే పార్టీకి చెందిన పాలవలస విక్రాంత్‌… శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌రాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో, శాసన మండలి చైర్మన్‌ ఈ ఏడాది జూన్‌ 2న అనర్హత వేసి రఘురాజును డిస్మిస్‌ చేశారు. దీనిపై ఆయన అప్పట్లోనే కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆరు వారాల పాటు స్టే విధించింది. ఈ నెల ఆరున తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ 3వ తేదీనే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రఘురాజుకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో ఉపఎన్నిక రద్దయింది.

➡️