- మంత్రికి ఎపి వెలుగు విఒఎల సంఘం వినతి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విఒఎల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని ఎపి వెలుగు విఒఎ ఉద్యోగుల సంఘం (సిఐటియు) కోరింది. ఈ మేరకు గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ.. విఒఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని, బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. అలాగే రూ.పది లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనేక మంది అనారోగ్యంతో, ప్రమాదాలుపాలై ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. యాక్సిడెంట్ సహజ మరణాలకు పిఎంజెజెబివై పథకాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘం అధ్యక్షులు రూపాదేవి, నాయకులు తిరుపతయ్య, సోమన్న, కృష్ణమ్మ, మహేష్, గిరిజ, గుంటెప్ప తదితరులు పాల్గొన్నారు.