యథేచ్ఛగా ఇసుక్ర అక్రమ రవాణా

Mar 31,2024 22:30 #pichhatoor, #smuggling of sand

– అడ్డుకున్న రైతులపై దాడి
– అధికారుల నిర్లక్ష్యమే అంటున్న గ్రామస్తులు
ప్రజాశక్తి- పిచ్చాటూరు (తిరుపతి జిల్లా) :తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పులికుండ్రం నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. బడా నాయకుల అండ చూసుకుని రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్న స్థానిక వైసిపి నాయకుడు, సర్పంచ్‌ అన్న దొరై, ఆయన అనుచరుడు వెంకటేష్‌పై రెవెన్యూశాఖ చర్యలు తీసుకోవడంలేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ఆక్రమ రవాణాపై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కావడంలేదని, దీని వల్ల గ్రామ చుట్టుపక్కల ఉన్న భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని వాపోతున్నారు. ఆదివారం ఉదయం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామ రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులపై ఇసుక అక్రమ రవాణాదారులు దాడికి తెగబడ్డారు. తమని ఎవరూ ఏమీ చేయలేరంటూ కత్తులతో బెదిరించడంతో పాటు తమను ఎదిరించిన వారు ఊరు దాటలేరంటూ సవాల్‌ విసురుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎస్‌ఐ వెంకటేశులును వివరణ కోరగా సర్పంచ్‌ అనుచరుడు వెంకటేష్‌పై కేసు నమోదు చేసి జరిమానా విధించామని చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇకపై అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

➡️