- సాగునీటి సంఘాల ఎన్నికలపై హైకోర్టు ఉత్తర్వులు
ప్రజాశక్తి-అమరావతి : సాగునీటి సంఘాల మేనేజింగ్ కమిటీల ఎన్నిక సాధ్యం కానప్పడు, ఏకాభిప్రాయం ఏర్పడనప్పుడు రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు ఓటర్లయిన రైతులను అనుమతించాలంది. ‘చేతులెత్తి ఎన్నుకునే విధానం’ను అమలు చేస్తే ఓటర్లు ఇబ్బందిపడతారని చెప్పింది. అలాంటప్పుడు వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఏకాభిప్రాయం కుదరనప్పుడు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఓటర్లు కోరవచ్చు. కావున ఓటును రహస్యంగా వేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలి’ అని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులిచ్చింది. విచారణను జనవరి 25కు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఆదేశించింది. చేతులు ఎత్తి ఎన్నిక నిర్వహించే విధానాన్ని సవాలు చేస్తూ ఎన్‌టిఆర్ జిల్లా, వేములనర్వ గ్రామానికి చెందిన చిరుమామిళ్ల శ్రీనివాసరావు, కమతం రాములు వేసిన పిటిషన్లలో హైకోర్టు పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఓటు విషయంలో తగిన సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసే స్వేచ్ఛ పిటిషనర్లు, ఇతర రైతులకు ఉంటుందని చెప్పింది. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చునంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.