కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించండి

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇండియా వేదిక భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని, రాష్ట్రంలో ధన రాజకీయాలను తిరస్కరించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రజానీకానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవని, దేశ భవిష్యత్‌, అభివృద్ధి, గమ్యాన్ని నిర్ణయించే ఎన్నికలని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ప్రధాని మోడీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కాంక్షతో మరోమారు మతన్మోదాన్ని నెత్తినెత్తుకుని, తద్వారా ఓటర్లను మత ప్రాతిపదికన చీల్చి మూడోసారి అధికారం చేపట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇసుక, మైనింగ్‌, మద్యం కుంభకోణాల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బులతో మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని, గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రాభివృద్ధి అటకెక్కిందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని, డబ్బు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయాలనుకునే పార్టీలకు తగిన బుద్ధి చెప్పి, ఓటు విలువ గుర్తించేలా చేయాలని ఆయన కోరారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి, లౌకికవాదాన్ని పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి దేశవ్యాప్తంగా 28 రాజకీయ పార్టీలు ఇండియా వేదికగా ఏర్పడి పోటీ చేస్తున్నాయని, ఎపిలో కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం పార్టీలు వేదిక పార్టీలుగా ఐక్యంగా పోటీ చేస్తున్నాయని, ఆ పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసి, గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రామకృష్ణ కోరారు.

➡️