- యాజమాన్యం ప్రకటన
- కార్మికుల ఆగ్రహం
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కుపై కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్నవారిని కూడా ఇంటికి పంపించే కుట్రలకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం దిగింది. ప్లాంట్‌లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (విఆర్‌ఎస్) స్కీంను ప్రకటిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 1.1.2026 తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి ఇది వర్తించనున్నట్టు తెలిపింది. ఈలోగా రిటైర్ అయ్యేవారికి ఇది వర్తించదని, అర్హత కలిగిన ఉద్యోగుల నుంచి ఈ విఆర్‌ఎస్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు స్టీల్ మేనేజ్‌మెంట్ పేర్కొంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే అంగీకరిస్తామని తెలిపింది. జనవరి 15 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్రక్రియకు గడువు విధించింది.
ప్రైవేటీకరణలో భాగమే
ఉక్కు ప్రయివేటీకరణలో భాగంగానే విఆర్‌ఎస్ ప్రకటన చేశారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఉద్యోగులు ఎవరూ విఆర్‌ఎస్ తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. ఉక్కునగరంలోని స్టీల్ సిఐటియు కార్యాలయంలో సంఘం గౌరవ అధ్యక్షులు అయోధ్యరాం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ.. విఆర్‌ఎస్ పేరుతో ఉద్యోగులను బయటకు పంపించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. జీతాలు చెల్లించేందుకే డబ్బులు లేవు అన్న ప్రభుత్వం విఆర్‌ఎస్‌కు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుందని, ఇది బూటకమని అంతా గ్రహించాలని అన్నారు. పార్లమెంటు సాక్షిగా ఉక్కు మంత్రి ఐదు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని 2023లో ప్రకటించారని, ఆ తర్వాత కాలంలో సుమారు 2000 మంది కార్మికులు ఉద్యోగ విరమణ చేశారని తెలిపారు. సుమారు 7000 ఉద్యోగాలు ఖాళీ ఉన్న సమయంలో ఈ విఆర్‌ఎస్ ప్రకటన అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇదే సమయంలో 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తానని పేర్కొంటూ యాజమాన్యం చర్యలు చేపడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ విధంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఉత్పత్తి జరగటం లేదని చెప్పి దీనిని మిట్టల్, అదానీ, జిందాల్, పోస్కో వంటి వారికి కట్టబెట్టడానికి చూస్తున్నారన్నారు. సమావేశంలో పోరాట కమిటీ ప్రతినిధులు డి.ఆదినారాయణ, కెఎస్‌ఎన్.రావు, యు.రామస్వామి తదితరులు పాల్గొన్నారు.