- ముస్లిము జెఎసి డిమాండ్
ప్రజాశక్తి – యంత్రాంగం : వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు అమలు చేయబోయని టిడిపి కూటమి ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో నిరసనలు తెలిపారు. నల్లబ్యాడ్జీలు, నల్ల చొక్కాలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనేక లొసుగులతో ఉన్న వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముస్లిము జెఎసి గౌరవాధ్యక్షులు మహమ్మద్ అబుల్, అబ్ధుల్ సయ్యద్ మాట్లాడుతూ.. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేంత వరకూ పోరాటాలు కొనసాగిస్తామన్నారు. వక్ఫ్ బోర్డులో 11 మందిలో ఏడుగురు ముస్లిమేతరులను చొప్పించినప్పుడు ఇక ముస్లిముల మాటకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు. వక్ఫ్ ట్రిబ్యునల్‌ను నిర్వీర్యం చేసి, ప్రభుత్వ మాట వినే కలెక్టర్‌కు, ఏ ఆస్తి ఎవరిదని నిర్ణయాధికారం ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరతుగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం, సిపిఐ, ఎస్‌డిపిఐ నాయకులు మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. నంద్యాల తహశీల్దార్ ప్రియదర్శినికి వినతిపత్రం అందజేశారు. నంద్యాల ముస్లిము జెఎసి కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు ముస్లిము జెఎసి నాయకులు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెల్లూరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని జెండా వీధిలోని హామీల మసీదు సెంటర్ నుంచి చిన్న బజారు, బార్కాస్ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ వరకు నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు ధరించి ముస్లిములు భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్‌బోర్డ్ సభ్యులుగా ముస్లిములే ఉండాలంటూ నినదించారు. ముస్లిం మైనారిటీలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని పలువురు ముస్లిములు విమర్శించారు. కేంద్ర ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టానికి సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన మద్దతును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లు ఆగిపోయేలా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముస్లిము మైనార్టీ నాయకులు కోరారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ముస్లిములు ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివయ్య స్తూపం వద్ద మనోహరంగా ఏర్పడి నిరసన తెలిపారు.