ప్రజాశక్తి-విజయవాడ : ప్రజా ఉద్యమ ఫలితంగా విజయవాడలో ఏర్పాటు చేసిన నీటి మీటర్లను నగరపాలక సంస్థ తొలగించింది. 24 గంటల నీటి సరఫరా పేరుతో మధురానగర్, పసుపు తోటలో నీటి మీటర్ల బిగించారు. ఆయా ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సిపిఎం నేతలు పర్యటించారు. తొలగించిన నీటి మీటర్లను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ… ఎట్టకేలకు ప్రజా ఆందోళన ఫలితంగా నగరపాలక సంస్థ నీటి మీటర్ల కనెక్షన్లను తొలగించారని అన్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా లక్ష గృహాలకు నీటి మీటర్లు బిగించాలనే ప్రయత్నాలకు అడ్డుకట్టపడిందని ఇది ప్రజా ఉద్యమ ఫలితమని ఆయన అన్నారు. అమృత్ పథకం పేరుతో మోడీ ప్రభుత్వం నీటి మీటర్లను రుద్దిందని, కేంద్ర షరతులకు లొంగి వైసీపీ ప్రభుత్వం నివాస గృహాలకు నీటి మీటర్లు బిగించిందని విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు దశల వారి ఆందోళన చేపట్టారని అన్నారు. నగరపాలక సంస్థ మీటర్లు తొలగించకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు నీటి మీటర్లను తొలగించాలని డిమాండ్ చేశారని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు మీటర్లు బిగించలేదని బుకాయించారని అన్నారు. నీటి మీటర్ల పై బహిరంగ చర్చకు పసుపు తోటలో సిద్ధమని బాబూరావు, సిపిఎం నేతల సవాలు విసిరితే మల్లాది విష్ణు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాల హయాంలో JNNURM పథకంలో భాగంగా నీటి మీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తే 15 సంవత్సరాల క్రితం సిపిఎం కౌన్సిల్ లోపల, బయట పోరాడిందని, ఫలితంగా నీటి మీటర్ల ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. మళ్ళీ బిజెపి, వైసిపిలు కుమ్మక్కయి నీటిని వ్యాపారంగా మార్చటానికి మీటర్ల ప్రక్రియ ప్రారంభించారని, ఇప్పుడు కూడా సిపిఎం అండతో స్థానిక ప్రజలు అడ్డుకున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నీటి మీటర్ల అంశాన్ని ప్రజా ఎజెండాగా మార్చాలి, పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. పట్టణ సంస్కరణల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌర సదుపాయాలను వ్యాపార సరుకులుగా మార్చుతున్నారని మండిపడ్డారు. తొలగించిన నీటి మీటర్లను నగరపాలక సంస్థ వెనక్కి తీసుకువెళ్లాలని, నీటి మీటర్ల ప్రాజెక్టును రద్దు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మంచినీటి సరఫరాను మెరుగుదల చేయాలని డిమాండ్ చేశారు. భారాలకు వ్యతిరేకంగా సిపిఎం సాగిస్తున్న కృషిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ పర్యటనలో బాబురావుతో పాటు సిపిఎం నగర నేతలు బి.రమణరావు, పి.కృష్ణమూర్తి, స్థానిక నాయకులు వై.కృష్ణ, బి చిన్నా, రాము, ఎం.రామారావు, నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.
