ఆర్‌ఆర్ మిశ్రా కమిటీ తర్వాతే డిఎస్సి
పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులపై రాష్ట్రప్రభుత్వం ఆశలు చల్లుతోంది. ముఖ్యమంత్రిగా తొలిసంతకం చేసిన హామీ ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు. వివిధ కారణాల చెబుతూ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. నవంబర్ 6వ తేదిన విడుదల చేస్తామని చెప్పినా విడుదల చేయని విషయం తెలిసిందే. తాజాగా ఎస్సి వర్గీకరణపై రాష్ట్రప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్(ఆర్‌ఆర్) మిశ్రా కమిటీ నివేదిక వచ్చిన తరువాతే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. ఈ నెల 7వ తేదిన ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించనున్న ‘మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్’ కార్యక్రమంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష డైరెక్టర్ బి శ్రీనివాసరావులతో కలిసి సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని విలేకర్లు ప్రశ్నించగా ఆర్‌ఆర్ మిశ్రా కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే తమ పని మొదలు పెడతామని ఆయన చెప్పారు. అయితే కమిటీ నివేదిక ఎప్పటికి వస్తుందో తనకు తెలియదని, ఈ అంశం తన పరిధిలో లేదన్నారు. పతి గ్రామంలో మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రారంభించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ‘మనబడి మన భవిష్యత్ ‘ కింద చేపట్టిన కార్యక్రమంలో సుమారు రూ.8వేల కోట్ల పనులు నిలిచిపోయాయని చెప్పారు. అవసరం లేని చోట కూడా పనులు నిర్వహించిన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తల్లిదండ్రుల సహకారం, భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 7వ తేదిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించారని, పెద్ద రాష్ట్రాల్లో ఎపిలోనే మొట్టమొదట నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారని వెల్లడించారు. ప్రజాప్రతినిధులందరూ కూడా తమకు దగ్గరలో ఉన్న పాఠశాలలో పాల్గొంటారని చెప్పారు.
