జలమయమైన మంగళగిరి కాజా టోల్‌ ప్లాజా

మంగళగిరి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఏపీలో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులు నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలపై వాయుగుండం ప్రభావం తీవ్రంగా పడింది. ఈ రెండు జిల్లాలో వర్షం దంచికొట్టడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల వరద ప్రవాహం రోడ్లపై ఉధఅతంగా ప్రవహిస్తోంది.
గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్‌ ప్లాజా వద్ద రోడ్డు నదిని తలపిస్తోంది. రోడ్డుపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. వరదనీటిలో చాలా వాహనాలు చిక్కుకుపోయాయి. టోల్‌ప్లాజా పరిసరాలకు వాహనదారులు రావొద్దంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతం కావడంతో కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని హెచ్చరించారు. మరోవైపు కాజా టోల్‌గేట్‌లో సర్వర్లు మొరాయించాయి. దీంతో టోల్‌గేట్‌ను ఎత్తివేసి వాహనాలను వదిలేశారు.

➡️