డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం : రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.100 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. పిఠాపురంలో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిని అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తామని తెలిపారు. పిఠాపురంతో సహా ఆరు మండలాల ప్రజలకు ఆస్పత్రి ద్వారా సేవలందుతాయన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. నియోజవర్గంలో 3,450 మంది మహిళలకు రూ.8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లను పంపిణీ చేశామన్నారు. రైతులకు రూ.26 లక్షలతో 2 వేల టార్పాలిన్లు, 50 శాతం రాయితీతో 103 వ్యవసాయ పరికరాలు అందించామని తెలిపారు. నియోజకవర్గంలో రూ.18.2 కోట్ల ఉపాధి నిధులతో 276 సిసి రోడ్లు, రూ.3 కోట్లతో బిటి రోడ్లు వేశామన్నారు. ఈ కారక్రమంలో కాకినాడ ఎంపి ఉదరు శ్రీనివాస్, ఎమ్మెల్సీలు హరిప్రసాద్, కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌విఎస్‌ఎన్.వర్మ, పెండెం దొరబాబు తదితరులు ఉన్నారు.
