దోపిడీకి గురవుతున్నాం

  • గిరిజన ఉత్పత్తులను జిసిసి కొనుగోలు చేయడం లేదు
  • సిపిఎం నేతల ఎదుట గిరిజనుల ఆవేదన
  • కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్రలు

ప్రజాశక్తి-యంత్రాంగం : గిట్టుబాటు ధర రావడంలేదని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ చేయడంలేదని, రేషన్‌ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలని, తాగునీరు, డ్రెయినేజీ సమస్యను పరిష్కరించాలని తదితర సమస్యలను సిపిఎం నేతల దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలు బుధవారం పలు జిల్లాల్లో కొనసాగాయి. ఈ సందర్భంగా స్థానిక రైతులు, ప్రజలు పలు సమస్యలను సిపిఎం నేతల ఎదుట ఏకరువు పెట్టారు. గిరిజన ఉత్పత్తులను జిసిసి కొనుగోలు చేయడం లేదని, దోపిడీకి గురవుతున్నామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోగొండ రిజర్వాయర్‌ ఆయకట్టు కింద పంట పొలాలకు సాగునీరు అందించాలని రైతులు తెలిపారు. చెత్త డంపింగ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌లో అనధికారంగా చెత్త డంపింగ్‌ చేస్తున్నారని, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని స్థానిక ప్రజలు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలోని 57 ఎకరాల అజిత్‌ సింగ్‌ నగర్‌ డిస్నీల్యాండ్‌ స్థలాన్ని సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బృందం దృష్టికి స్థానిక ప్రజలు పలు సమస్యలు తీసుకొచ్చారు. డిస్నీల్యాండ్‌ లీజు ఏనాడో ముగిసిందని, ఈ స్థలం నిరుపయోగంగా ఉండి చిట్టడవిలా వ్యర్ధపదార్థాలతో నిండిపోయిందని, దీంతో చుట్టుపక్కల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. చెత్త డంపింగ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌లో అనధికారంగా చెత్త డంపింగ్‌ చేస్తున్నారని, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ఖాళీగా ఉన్న ఈ స్థలాన్ని ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ డిస్నీలాండ్‌ స్థలాన్ని కబేళా కోసం వినియోగించే తీర్మానాలను రద్దు చేయాలని, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఇరపాడుగూడ, కొత్తగూడ, గొట్టుపల్లి, భూతలగూడ, వజ్రపుకొత్తూరు మండలం బెండి తదితర గ్రామాల్లో గిరిజనులు మాట్లాడుతూ.. గిరిజన ఉత్పత్తులను జిసిసి కొనుగోలు చేయడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న దృష్టికి తీసుకొచ్చారు. 21 రకాల గిరిజన ఉత్పత్తులను 2027 వరకు కొనుగోలు చేస్తామని అగ్రిమెంట్‌ చేసి కొనుగోలు చేయకపోవడంతో, దోపిడీకి గురవుతున్నామని తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చైతన్య యాత్రలు కొనసాగాయి. కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధానంగా తాగునీరు, డ్రెయినేజీ, సిమెంట్‌ రోడ్లు తదితర సమస్యలను ప్రజలు నాయకులు విన్నవించారు. వ్యవసాయ భూములు ఇవ్వాలని, రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు తదితర సమస్యలను నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని కె.కొత్తూరు చెంచు గూడెం, హరినగరం, ఆలమూరులో చెంచులు సిపిఎం నాయకులకు వివరించారు. విశాఖ జిల్లా గాజువాక, ములగాడ, ఆరిలోప ప్రాంతాల్లోనూ, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలోని పలు గ్రామాల్లోనూ సిపిఎం ప్రజాచైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లు, తాగునీరు, విద్యుత్‌ బిల్లులు తదితర సమస్యలను పలువురు సిపిఎం నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని పోగొండ రిజర్వాయర్‌ పంట కాలువను సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మొడియం నాగమణితో రైతులు మాట్లాడుతూ రిజర్వాయర్‌ ఆయకట్టు కింద పొలాలకు సాగునీరు అందడంలేదని తెలిపారు. శ్మశాన వాటికల్లో ఆక్రమణలకు గురైందన్నారు. సమస్యల పరిష్కారం కోసం టి.నర్సాపురంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

➡️