కప్పట్రాళ్లలో తవ్వుతున్నాం

Nov 10,2024 00:54 #Kurnool District, #urenium
  • యురేనియం’పై 2023లో పార్లమెంటులో కేంద్రం ప్రకటన
  • దేశీయ ఉత్పత్తి పెంచడానికంటూ వివరణ

ప్రజాశక్తి-అమరావతి :‘ యురేనియం కోసం కప్పట్రాళ్లలో 2018 తరువాత ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. అప్పుడు కొన్ని బోర్లు వేసి శ్యాంపిల్స్‌ మాత్రమే తీసుకున్నారు’ ఇది యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజానీకాన్ని ఉద్ధేశించి కర్నూలు జిల్లా కలెక్టర్‌ ఇటీవల చేసిన ప్రకటన! ఆయనతో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇటువంటి మాటలే చెబుతున్నారు. అయితే, వాస్తవం దీనికి భిన్నంగా వుంది. ‘కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం కోసం తవ్వుతున్నాం’ అంటూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేసింది. 2023 డిసెంబర్‌ 14న రాజ్యసభలో ఆప్‌ సభ్యుడు సంత్‌బల్బీర్‌ సింగ్‌ అడిగిన ప్రశ్నకు ప్రధానమంత్రి తరపున అప్పటి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఇచ్చిన రాత పూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. అధికారులతో పాటు అధికారపార్టీ నాయకులు చెబుతున్న విధంగా 2018 తరువాత స్థానికంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించపోతే 2023లో కేంద్రం అటువంటి ప్రకటన ఎందుకు చేసింది? పైగా ఈ ప్రశ్నకు ముందు అడిగిన మరో ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, పల్నాడు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో యురేనియం నిక్షేపాలను కనుగొన్నట్లు కేంద్రం తెలిపింది. దాని కొనసాగింపుగా అడిగిన ప్రశ్నకు ఆటమిక్‌ మినరల్స్‌ డైరక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోకరేషన్‌ అండ్‌ రీసెర్చి (ఎఎండి) ఆధ్వర్యంలో ఈ తవ్వకాల ప్రక్రియ జరుగుతోందని, యురేనియంలో దేశీయంగా స్వయం సమృద్ధిని సాధించడమే ఈ తవ్వకాల లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. కర్నూలుతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు నిర్వహిస్తున్న ప్రాంతాల జాబితాను కేంద్రం జతపరిచింది.

4.10 లక్షల టన్నుల సామర్థ్యం

సెప్టెంబర్‌ 2023 నాటికి 4,10,122 టన్నుల యురేనియం నిల్వలను ఎఎండి కనుగొందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, జార్ఖండ్‌,మేఘాలయ, రాజస్థాన్‌, కర్నాటక, ఛత్తీస్‌గడ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్రల్లోని 47 ప్రాంతాల్లో ఈ నిక్షేపాలను కనుగున్నట్లు తెలిపారు. వీటిలో తవ్వకాలకు ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌ సూత్రబద్ద అనుమతి ఇచ్చిందని, యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యుసిఐఎల్‌) రాజ్యాంగ బద్దంగా చేయవలసిన ఇతర కార్యక్రమాలను చేపట్టిందని తెలిపింది. ఈ పనులు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి రాతపూర్వకంగా తెలిపారు.

➡️