చావలేక బతుకుతున్నాం

  • హామీలేగానీ తరలించడంలేదు
  • ప్రజా చైతన్య యాత్రలో వి.శ్రీనివాసరావు వద్ద తాడి మహిళల ఆవేదన

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : ‘డబ్బున్నోళ్లంతా బయట ఇల్లు కట్టుకొని వెళ్లిపోతున్నారు. లేనోళ్లమంతా ఇక్కడే ఉంటున్నాం. ఫార్మా పరిశ్రమల కాలుష్యంతో చర్మ, ఊపిరితిత్తులు, అల్సర్‌, కేన్సర్‌, గుండె జబ్బులు వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నాం. రాత్రి నీరు పడితే తెల్లారేసరికిపైన తెట్టులా చేరుతోంది’ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముందు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామ మహిళలు వాపోయారు. ఈ ఊరి మగ పిల్లలకు ఆడపిల్లలను ఇవ్వడం లేదని, ఆడపిల్లలను బయట గ్రామాల మగ పిల్లలు పెళ్లి చేసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీ కాలుష్య ప్రభావిత గ్రామమైన తాడిలో సోమవారం సాయంత్రం సిపిఎం నాయకులు పర్యటించారు. తాము ఎదుర్కొంటున్న కాలుష్య, ఉపాధి, అనారోగ్య సమస్యలను స్థానిక మహిళలు వి,శ్రీనివాసరావు ముందు ఏకరువు పెట్టారు. ఊరును తరలిస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం తప్ప తరలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాణం చేశారు

ఊరును తరలించే బాధ్యత నాదంటూ బండారు సత్య నారాయణ మూర్తి… మాలలో ఉంటూ మందిరంలో ప్రమాణం చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సమస్య పరిష్కరిం చడం లేదు. 15 ఏళ్ల నుంచి కాలుష్య సమస్యతో బాధపడుతున్నాం. దుర్వాసన భరించలేక సాయంత్రం ఇళ్ల నుంచి బయటకు రాలేక తలుపులు వేసుకొని ఉంటున్నాం. ఆరు నెలల్లో తరలిస్తామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అప్పట్లో హామీ ఇచ్చారు. తరలింపు జరగలేదు’ అని గొల్లవిల్లి రత్నం వాపోయారు.

తోలు బొమ్మలా ఆడిస్తున్నారు

‘రాంకీ సరఫరా చేస్తున్న నీరు రెండు రోజులు నిల్వ ఉంటే పురుగులు తేలుతున్నాయి. కాలుష్యంతో చెప్పలేని బాధలు పడుతున్నాం. ముసలి వాళ్లే కాదు… చిన్న పిల్లలూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కంపెనీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి పిల్లలను ఎత్తుకొని పారిపోయిన రోజు ఎవరూ పట్టించుకోలేదు. మేము చెప్పిన సమస్యలు టివిల్లో రానీయకుండా కరెంట్‌ ఆపేస్తున్నారు. పేపర్లలో రానీయడం లేదు. మేము మోసపోతున్నాం. తోలు బొమ్మలా అడిస్తున్నారు’ అని గ్రామానికి చెందిన లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

చావలేక బతుకుతున్నాం

నా కొడుకు గుండె సమస్యతో పుట్టాడు. ఇలా ప్రతి ఇంట్లో రోగులు ఉన్నారు. రోగికే పెడతామా? మేమే బతుకుతామా? గాలి, నీరు కలుషితమవుతుంటే ఎలా బతుకుతాం. కిడ్నీలుపోతే ఎవరిస్తారు? కంపెనీల నుంచి పావలా ఉపయోగం మాకు లేదు. దిక్కుతోచక బతుకుతున్నాం. న్యాయమైన పరిహారం ఇచ్చి మంచి ప్రాంతానికి తరలిస్తేగానీ మా సమస్యకు పరిష్కారం దొరకదని బాలమ్మ అన్నారు.

గ్రామాన్ని తరలించే వరకూ  ఐక్యంగా పోరాడాలి : వి శ్రీనివాసరావు

అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రాణాంతక కాలుష్యం ప్రజలపై రుద్దుతున్నారన్నారు. తాడిని తరలించకపోతే కంపెనీలు నడపలేని స్థితికి చేరేలా పోరాటం ఉండాలన్నారు. తాడి ప్రజల న్యాయమైన పోరాటానికి సిపిఎం మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఊరును వల్లకాడులా చేసే నేతలను జైళ్లలో పెట్టాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భూములు కోల్పోయిన వారికి, కాలుష్య ప్రభావిత గ్రామాల ప్రజలకు నైపుణ్యాలు నేర్పి ఉద్యోగాలు ఇవ్వొచ్చని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం మాట్లాడుతూ స్థానికులకు పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కంపెనీలతో రాజీపడి కొంతమంది నాయకులు ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ, ఆర్‌.శంకరరావు, సీనియర్‌ నాయకులు నాయనిబాబు, వంజరాపు రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️