సోలార్‌ ఎనర్జీ తప్పనిసరి వినియోగ ఒప్పందం

  • ప్రజల సొమ్మును ప్రైవేటుకు దోచిపెట్టేందుకే
  • ఎపిఇఆర్‌సికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సోలార్‌ ఎనర్జీని తప్పనిసరిగా వినియోగించుకోవాలనే కేటగిరీ కింద ఒప్పందం చేసుకోవడం ప్రజల సొమ్మును అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. 2023-2024 ఆర్ధిక సంవత్సర ఛార్జీలకు సంబంధించి విద్యుత్‌ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన పిటీషన్లు ఓపి నెం 69/2024, 70/2024, 71/2024కు సమాధానంగా దాఖలు చేస్తున్న అభ్యంతరానికి కొనసాగింపుగా మంగళవారం మరో లేఖ పంపించారు.

రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థలు కచ్చితంగా వినియోగించాలనే కేటగిరీ కింద సెకీతో ఒప్పందాలు చేసుకున్నాయని, ఇది సరికాదని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి థర్మల్‌ ప్లాంట్లను నెలకొల్పింది వాటి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికే అన్నది స్పష్టమని, వాటి పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోకుండా, ప్రైవేటు కంపెనీల సోలార్‌ తప్పనిసరిగా వినియోగించుకోవలసిన కేటగిరీ కింద ఒప్పందం చేసుకోవడం ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీయడానికేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్మును ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడానికేనని భావిస్తున్నట్లు తెలిపారు. అందుకే ఈ ఒప్పందాల ద్వారా ఏర్పడే ఎఫ్‌పిపిసిఎ ఛార్జీలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రజలకు భారంగా మారే విధంగా సెకీతో ఒప్పందాలు చేసుకోవడం వెనుక అవినీతి ఉందని యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా, తూర్పు న్యూయార్కు జిల్లాలో ఉన్న జిల్లా కోర్టులో 24 అక్టోబర్‌, 2024వ తేదీన కేసు నమోదైందని, ఈ కేసు పిటీషన్‌లో 46,47,48,49 పేరాల ప్రకారం సెకీ ఒప్పందాలు పూర్తిగా అవినీతితో కూడుకున్నవని స్పష్టం చేశారని తెలిపారు. ఆదానీ ఆధ్వర్యంలో 7,000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను దీర్ఘకాలం పాటు కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలకు రూ.1,750 కోట్ల లంచం ఇచ్చారని పిటీషన్‌లో ఉందని, ఇలా అవినీతికి పాల్పడి 7,000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను కొనడానికి ఎపి డిస్కంలు సెకీతో 25 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయని, అవినీతి వల్లే వాటిని కచ్చితమైన వినియోగ కేటగిరీగా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఈ అవినీతితో కూడిన విద్యుత్‌ను కొనడంకోసం రాష్ట్ర ప్రభుత్వ రంగంలో థర్మల్‌ ప్లాంట్ల విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయనీయకుండా తగ్గించి వేశారని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. అవినీతితో కూడిన ఈ సోలార్‌ ఎనర్జీ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని, దీనిపై విచారణ జరిపించాలని, మిగిలిన పిపిఎలను కూడా సమీక్ష చేయాలని కోరారు. గతంలో కొన్న విద్యుత్‌కు ఇప్పుడు ఛార్జీలు విధించడం అంటే గత విద్యుత్‌ చార్జీల టారిఫ్‌ను ఇప్పుడు పెంచడమే అవుతుందని వివరించారు. అందుకే ఇది వాయిదా వేసిన ఛార్జీల టారిఫ్‌ పెంపుదలగా భావిస్తున్నామని వివరించారు. దేనికీ లేని విధంగా గతంలో వాడిన దానికి ఇప్పుడు రేట్లు పెంచి వసూలు చేయడం దారుణమని వివరించారు. అందువల్ల ఈ ట్రూఅప్‌, సర్దుబాటు ఛార్జీల విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. నివాస గృహాలకు, షాపులు, సంస్థలకు స్మార్ట్‌ మీటర్లు బిగించడానికి అదాని సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారని, ఇందులోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయని వివరించారు. దీనివల్ల విద్యుత్‌ వినియోగదారులపై వేలాది కోట్ల రూపాయల భారం పడుతుందని, అదానీ ఇతర సంస్థలతో కుదుర్చుకున్న స్మార్ట్‌ మీటర్ల ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. స్మార్ట్‌ మీటర్ల బిగింపు నిలిపివేయాలని విజ్ఞపి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అదానీ సంస్థలతో గ్రీన్‌ ఎనర్జీ పేరుతో ఒప్పందాలు చేసుకుంటోందని, దానికి భూములూ కేటాయిస్తున్నారని తెలిపారు. వీటిని నిలుపుదల చేసి, ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు.

బహిరంగ విచారణ జరపాలని విజ్ఞప్తి

విద్యుత్‌ నియంత్రణ మండలి ఈ అంశంపై బహిరంగ విచారణ జరిపే తేదీని ప్రకటించలేదని, విద్యుత్‌ వినియోగదారులు అనేకమంది అనేక రకాలైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల రాతపూర్వకమై అభ్యంతరాలకే పరిమితం కాకుండా ఈ అంశంపై బహిరంగ విచారణ నిర్వహించాలని, దానికి తగిన తేదీని ప్రకటించాలని విద్యుత్‌ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశారు.

➡️