వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం

Aug 22,2024 21:55 #opposing, #Waqf Bill\

– మైనార్టీల భద్రత అంశంలో రాజీపడం
-వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల భద్రతే వైసిపి లక్ష్యమని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన ముస్లిం మైనార్టీలతో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో 70 శాతానికి పైగా వక్ఫ్‌ భూములు కబ్జాలో వున్నాయని, వాటిని వక్ఫ్‌ బోర్డుకు దక్కకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చిందని మైనార్టీల ప్రతినిధులు జగన్‌ దృష్టికి తెచ్చారు. కొత్త వక్ఫ్‌ బిల్లు మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వుందని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సమస్యలపై వైసిపి ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం వైసిపి అండగా వుందన్నారు. వక్ఫ్‌ బిల్లును పార్లమెంటులో వైసిపి వ్యతిరేస్తుందన్నారు. వక్ఫ్‌ బిల్లుపై వేసిన పార్లమెంటు సంయుక్త కమిటీ (జెపిసి)లో సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకెళ్తారని అన్నారు. రాష్ట్రంలో వక్ఫ్‌ భూముల పరిరక్షణకు గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అన్నారు. వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జిఓ 60ను వైసిపి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
అక్రమ కేసులపై వైసిపి లీగల్‌ సెల్‌ పోరాటం
టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శాంతిభద్రతలు క్షీణించాయని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. టిడిపి వాళ్లే దాడులు చేసి, వారే కేసులు పెడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి లీగల్‌ సెల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొద్భలంతోనే దాడుల పర్వం కొనసాగుతోందని వైసిపి లీగల్‌ రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని కోరారు. రెడ్‌బుక్‌లో పేర్లు పెట్టుకుని దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు శాంతిభద్రతలపై సమీక్ష చేసిన రోజునే తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడుగుపెట్టనీయకుండా దాడులు చేశారన్నారు.

➡️