- వైసిపి ఆవిర్భావ సభలో జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ‘ప్రజల కష్టాల నుండి వైసిపి పుట్టింది. వారికి తోడుగా నిలిచింది. ఇప్పుడు కూడా ప్రజల గొంతుక అవుతాం. వారి తరపున ప్రశ్నిస్తాం.’ అని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైసిపి 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వైసిపి స్థాపించి 15 సంవత్సరాలు అవుతోందని, ఈ పదిహేను ఏళ్లలో పది సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నామని చెప్పారు. ‘ప్రతి పక్షంలో కూర్చోవడం కొత్తేమీ కాదు. పది సంవత్సరాలు ప్రతిపక్షంలోనే అధికారపక్షానికి దీటుగా నిలిచాం.’ అని అన్నారు.. కళ్లుమూసి తెరిచేలోపు ఏడాది అయిపోయిందని, మరో మూడు, నాలుగేళ్లలో వైసిపినే అధికారంలోకి వస్తుందని చెప్పారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన పదినెలల్లో సూపర్‌సిక్స్, సూపర్‌సెవన్ అన్నీ గాలికెగిరిపోయాయని అన్నారు. ఫీజులు, విద్యాదీవెన, రీయంబర్స్‌మెంట్‌కు సంబంధించి ఏడాదికి రూ.2,800 కోట్లు కేటాయించాలని, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లు కేటాయించాలని, మొత్తంగా రూ.3,900 కోట్లు కేటాయించాల్సి ఉంటే రూ.700 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. 2025-26కు సంబంధించి విద్యార్థులకు రూ.7,100 కోట్లు కేటాయించాల్సి ఉండగా, రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. వైసిపి ఎప్పుడూ ప్రజలకు తోడుగా ఉంటుందని చెప్పారు. అనంతరం విద్యార్థుల ఫీజు అంశంపై ఎక్స్‌లో పోస్టు కూడా చేశారు. ఆవిర్భావ దినోత్సవంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి, మహిళా విభాగం అధ్యక్షులు వరుదు కల్యాణి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.