- రాష్ట్రంలో ఐదు ఇన్నోవేషన్ హబ్‌లు
- సంబేపల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి – కడప ప్రతినిధి : గోదావరి-బనకచర్ల అనుసంధాన పనులకు సంబంధించిన రూ.80 వేల కోట్ల నిధుల సహాయార్థం కేంద్రాన్ని ఒప్పిస్తామని, తద్వారా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనులను పూర్తి చేయడం ద్వారా రాయలసీమను కరువు రహిత ప్రాంతంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. శనివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో ఎన్‌టిఆర్ విగ్రహావిష్కరణ, పేదల సేవలో పేరుతో నిర్వహించిన పింఛన్ల పంపిణీ అనంతరం ప్రజావేదిక కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పింఛన్ లబ్ధిదారులైన కొప్పుల మంగమ్మ, గొల్ల చలపతి, వెంకటేశ్వర్లు నివాసాలకు వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పింఛన్లను అందజేశారు. పింఛనుదారుల అభ్యర్థన మేరకు ఇళ్లస్థలం, ఇళ్ల నిర్మాణానికి హామీనిచ్చారు. అనంతరం వికలాంగుడైన వెంకటేశ్వర్లకు ఎలక్ట్రిక్ వాహనం, రూ.30 వేల విలువ కలిగిన సబ్సిడీ సోలార్ విద్యుత్ సదుపాయాన్ని కలిగించారు. రూ.1.5 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటి ప్రొఫెషనల్స్ అనుభవాలను పరిచయం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని రాయచోటి స్థానాన్ని గెలిపించడం ద్వారా కేంద్రంలో రాష్ట్రానికి గౌరవం పెరిగిందని, తద్వారా వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ లభించిందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో వర్క్‌ఫ్రమ్ హోమ్‌పై ప్రచారం చేశానన్నారు. కడప వంటి చోట్ల వర్క్‌స్టేషన్లు, జిసిసి ఏర్పాటు చేస్తామని, ఔత్సాహికులకు ఇన్సెంటివ్స్ ఇచ్చే పాలసీ తయారు చేస్తామని తెలిపారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎన్‌టిఆర్ స్ఫూర్తిగా నిలిచారని, అనంతరం రూ.64 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించామని చెప్పారు. 2019-2024 సంవత్సరంలో వైసిపి సర్కారు ఒక్క పైసా ఖర్చు పెట్టిన పాపానపోలేదని విమర్శించారు. పోలవరాన్ని గోదావరిలో ముంచేసిందని, డయాఫ్రమ్ వాల్‌ను నామరూపాలు లేకుండా చేయడంతో అదనంగా మరో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించిందని తెలిపారు. కడపలోని కొప్పర్తికి కేంద్రం పారిశ్రామికవాడ నిధులు అందించిందన్నారు. ఓర్వకల్లును డ్రోన్ సిటీగా మారుస్తామని తెలిపారు. వాట్సప్ పాలన ద్వారా 161 సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 నాటికి రూ.55 లక్షల మేరకు తలసరి ఆదాయం ఉండాలని, ఏటా 15 శాతం వృద్ధితో దేశంలో రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలవాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆహారోత్పత్తుల హబ్‌గా మార్చడానికి గల అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఆర్‌టిసి బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలనుకుంటున్నానని తెలిపారు. రైతు భరోసా విడుదల చేయాలని చంద్రబాబును ఓ రైతు అడగగా.. అమ్మబడి, రైతు భరోసాకు కట్టుబడి ఉన్నామని, త్వరలో నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బి.సి.జనార్ధన్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.