కేంద్రం చెప్పిందే మేం చేశాం !

  • ‘సెకి’ ఒప్పందంపై మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • శాలువా కప్పాల్సిందిపోయి.. విమర్శిస్తున్నారని వ్యాఖ్య

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వివాదాస్పద సెకి (సోలార్‌ ఎనర్జి కార్పొరేషన్‌) ఒప్పందంలో కేంద్రప్రభుత్వం చెప్పిందే తాము చేశామని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైసిపి కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెకి ఒప్పందానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన ప్రస్తావించారు. ‘ఉచిత కరెంటు ఇస్తూ రైతులకు మేము చేస్తున్న మంచిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ మంచిని ప్రశంసించింది. ఆ సంకల్పానికి తోడుగా ఉంటామంటూ లేఖ రాసింది. తామే పవర్‌ సప్లై చేస్తామని చెప్పింది. దీనిలో మూడోపార్టీకి స్థానం ఎక్కడుంది?’ అని ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం చెప్పినట్టే మేం చేశాం. కేంద్ర ప్రభుత్వ సంస్థయైన సెకితో, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిస్కామ్‌లు ఒప్పందం కుదుర్చుకు న్నాయి. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం’ అని చెప్పారు. ‘అది కూడా రూ.2.49కే ఇస్తామని చెప్పింది. ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు లేకుండా ఇస్తామని చెప్పింది. స్పెషల్‌ ఇన్సెంటివ్‌ కూడా ఇస్తానని అంది. వీటన్నింటివల్ల ఏడాదికి రూ.4,400 కోట్లు కలిసి వస్తాయి. ఒప్పదం ప్రకారం పాతికేళ్లకు లక్షలకోట్లు కలిసివచ్చేవి’ అని జగన్‌ చెప్పారు. ‘ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్‌’ అని ఆయన అన్నారు. ఇంత తక్కువకు విద్యుత్‌ తీసుకువస్తే శాలువా కప్పి సన్మానం చేయాల్సింది పోయి, విమర్శిస్తున్నారని, మంచి చేసిన వాడిపై రాళ్లు వేస్తున్నారని అన్నారు. ‘మంచిలేదు.. చెడులేదు. ధర్మం లేదు.. న్యాయం లేదు బండలు వేయడమే వారి పని’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఆఫర్‌ను కాదంటే, తక్కువ ధరకు విద్యుత్‌ వస్తుంటే కొనలేదని మరలా ఇదే నాయకులు విమర్శలు చేసేవారని పేర్కొన్నారు. అదానీపై నమోదైన కేసు వ్యవహారంలో ఎక్కడా తనపేరు లేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. సిఎంగా ఉన్నంతమాత్రాన తనకు ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తనపై దుష్ప్రచారమే ధ్యేయంగా తప్పుడు వార్తలు రాస్తున్న రెండు మీడియా సంస్థలపై 100 కోట్ల రూపాయల మేరకు పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. 48 గంటల్లో ఆ సంస్థలు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దావా వేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఒప్పందాలపై వివరణ ఇస్తూ 2014-19 మధ్య కాలంలో 133 పిపిఎలు చేసుకున్నారని, వాటికి రూ.4.84 నుండి రూ.4.83 వరకూ ధర ఉందని వివరించారు. 2014లో 640 మెగావాట్లను చంద్రబాబునాయుడు యూనిట్‌ రూ.6.49కి ఒప్పందం చేసుకున్నారని వివరించారు. విండ్‌ పవర్లో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం వల్ల 25 ఏళ్లలో రూ.50 వేల కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని, సోలార్‌ ఎనర్జీని సరాసరి రూ.5.90 పైసలకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, యథేచ్చగా చట్ట ఉల్లంఘన జరుగుతుందని పేర్కొన్నారు. తాను సంపద సృష్టిస్తే, చంద్రబాబు ఆవిరి చేస్తున్నారని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

➡️