- ఎస్సి వర్గీకరణపై శాసనసభలో సిఎం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎస్సి వర్గీకరణపై ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శాసన సభలో షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై గురువారం నిర్వహించిన చర్యలో ఆయన మాట్లాడుతూ ఎస్సి ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీం కోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని నిర్ణయించినట్లు, నూతన జనాభా లెక్కింపు పూర్తయిన అనంతరం వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 30 ఏళ్ల కిందట ఎస్సి వర్గీకరణకు తానే కమిటీ వేశానని, నాటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చేంత వరకూ సుధీర్ఘ ప్రయాణంలో భాగస్వామిగా ఉన్నానని తెలిపారు. 2024 నవంబరు 15న ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేశామని, ఆయన ఈ నెల 10వ తేదీన సమగ్ర నివేదిక సమర్పించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో వెనుకబడిన కులాలకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని, వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని చెప్పారు. తూర్పు కాపులకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే అంశం పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
బుడగ జంగాలలను ఎస్సిల్లో చేర్చాలని తీర్మానం
బుడగ జంగాలలను ఎస్సిల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… బుడగ జంగాల స్థాయి ఏమిటో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. చాలా తక్కువ సంఖ్యలో ఉన్న వీరిని ఎస్సిలుగా గుర్తించాలని కోరుతూ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
చంద్రబాబు, మంద కృష్ణలే కారణం : పవన్
ఎస్సి వర్గీకరణ ప్రక్రియ ఈ స్థాయికి చేరుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంద కృష్ణే కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
శాసన సభలో ఎస్సివర్గీకరణపై చర్చలో ఆయన మాట్లాడుతూ, వర్గీకరణకు బీజం వేసింది మంద కృష్ణ, రూపకర్త చంద్రబాబు, ఫలప్రధాత మోడీ అని అన్నారు. ఈ చర్చలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, బి.రామాంజనేయులు, కొండ్రు మురళీమోహన్, మందపాటి వెంకటపతిరాజు, బొనెల విజయచంద్ర, కాలవ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ, కొణతల రామకృష్ణ, పి.సునీల్ కుమార్, తంగిరాల సౌమ్య తదితరు ప్రసంగించారు.