- పోరాట స్ఫూర్తిని రగిలిస్తాం
- రాష్ట్రానికి దిక్సూచిగా మహాసభ
- మేం ప్రజా పక్షం… ప్రజల కోసమే పనిచేస్తున్నాం
- సుందరయ్య స్ఫూర్తి అందరిలో ఉంది
- ప్రజాశక్తి’ ఇంటర్వ్యూలో వి శ్రీనివాసరావు
‘నూతన ఆర్థిక విధానాలు, విద్యా విధానాల ప్రభావం యువతపై పడుతోంది. పెరగుతున్న నిరుద్యోగం, ఉపాధి రహిత పరిస్థితుల్లో వారు పెడ దవోవ పట్టకుండా చూడాలి. యువతలో పోరాట స్ఫూర్తిని రగిలిస్తాం. వారిని కదిలించి అభ్యుదయం వైపు నడిపిస్తాం. ‘ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం 27వ రాష్ట్ర మహా సభ సందర్భంగా ప్రజాశక్తి ప్రతినిధి పి.బాలకృష్ణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య సొంత గడ్డ సింహపురి. ఉద్యమ వేగుచుక్క జక్కా వెంకయ్య ప్రజాపోరాటం నడిపిన ప్రాంతమిది. ఆ ఉద్యమ శిఖరాలు లేకపోయినా ప్రతి నాయకుడు, కార్యకర్తల్లో వారు నింపిన ఉద్యమ స్ఫూర్తి అలాగే ఉంది.’ అని అన్నారు. మహాసభకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు.’ఈ మహాసభ రాష్ట్ర ప్రజల జీవన విధానం మార్చడానికి, పోరాట స్ఫూర్తిని రగలించడానికి వేదిక కానుంది’ అని అన్నారు. ఇంటర్వ్యూ వివరాలు క్లుప్తంగా :
ప్ర: నెల్లూరు కమ్యూనిస్టు ఉద్యమానికి గొప్ప చరిత్ర ఉంది. జక్కా వెంకయ్య లేకుండా జరుగుతున్న పెద్ద కార్యక్రమం ఇది. మహాసభ ఎలా జరుగనుంది.
జ : నెల్లూరు ఉద్యమంలో పుచ్చలపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్యల త్యాగాల పోరాట చరిత్ర అందరికీ తెలిసిందే. వారు మా నాయకులు. సిపిఎంను బలమైన శక్తిగా మార్చడానికి వారితో పాటు అనేకమంది త్యాగాలు చేశారు. వారు ఇప్పుడు లేకపోవచ్చు. కానీ, కార్యకర్తల్లో వారు నింపిన స్ఫూర్తి అలాగే ఉంది. ఇప్పుడు అది మరింత బలంగా పనిచేస్తోంది. నెల్లూరు ప్రజలు ఎప్పుడు సిపిఎంకు అండగా ఉంటారు. ఈ మహాసభ ఘనం జరుగుతుంది.
ప్ర: మీరు ఏదో ఒక పార్టీ వైపు ఉంటారని టిడిపి, వైసిపిలు ప్రచారం చేస్తుంటాయి. మీరు ఎవరి పక్షం?
జ : మేం ప్రజాపక్షం. అధికార పార్టీల విధానాలను ఎప్పటికప్పుడు ఎండుగడుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్నది ఒక్క సిపిఎం మాత్రమే. దీనికోసం మాకు ఎవరి సర్టిపికెట్లూ అవసరం లేదు. ఆ రోజు వైసిపి, నేడు టిడిపి విధానాలను మా పార్టీ మాత్రమే వ్యతిరేకిస్తోంది. ఒక్కసారి పోలీస్ స్టేషన్‌ల్లో కేసులు పరిశీలిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. బిజెపికి అంటకాగుతోన్న ఆ రెండు పార్టీలూ మాపై బురద చల్లుతున్నాయి. అప్పుడూ, ఇప్పుడూ పోరాటాలు చేసింది కమ్యూనిస్టులు మాత్రమే.
ప్ర: నెల్లూరులో జరుగుతోన్న మహాసభ ప్రత్యేకత ఏమిటి? ఏం చర్చించబోతున్నారు?
జ: గత మహాసభ గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించాం. అప్పటి వరకు అమరావతి రాజధాని భ్రమలో పెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి కాదని చెప్పారు. మా సభలో అమరావతిలోనే రాజధాని ఉండాలని తీర్మానించాం. రైతుల పోరాటానికి మా పార్టీ మద్దతు ఇచ్చింది. నేడు అధికారంలోకి వచ్చిన టిడిపి… బిజెపిని భుజానికి ఎత్తుకొని ప్రజలను మోసం చేస్తోంది. కార్మికుల, కర్షకుల, ఉద్యోగుల, ప్రజ జీవన విధానాన్ని దెబ్బతీస్తోంది. ఇలాంటి సమయంలో నెల్లూరులో జరుగుతోన్న మహాసభ పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుండి 500 మంది ప్రతినిధులు వస్తున్నారు. వీరు మూడు రోజుల పాటు చర్చిస్తారు. భవిష్యత్తు ఉద్యమాల కు రూపకల్పన చేస్తారు. 1978లో పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో నెల్లూరులో రాష్ట్ర మహాసభ జరిగింది. 47 సంవత్సరాల తర్వాత నెల్లూరు మళ్లీ ఆతిధ్యమిస్తోంది.
ప్ర: కమ్యూనిజం ఉనికి కోల్పోతోంది. ఎక్కడుంది అనే వారికి ఏం చెబుతారు?
జ:సోవియట్ యూనియన్ పతనం అనంతరం కమ్యూనిస్టుల పని అయిపోయిందని సంబరపడ్డారు. అది ఒక మేనియాగా మారింది. కమ్యూనిస్టు ఉద్యమంలో హెచ్చుతగ్గులు ఎప్పుడూ సహజమే. 1968-73లో బెంగాల్‌లో కమ్యూనిజం అడుగంటిపోయిందంటూ తీవ్రమైన భీభత్సం చేశారు. వెయ్యి మందిని చంపేశారు. 1978లో ఎన్నికలు పెడితే ఊహించని విజయం కమ్యూనిస్టులు సొంతం చేసుకున్నారు. కేరళలో 300 మందిని చంపారు. ఎమర్జెన్సీ తర్వాత సిపిఎం విశిష్టత ప్రజలకు అర్థమైంది. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. సిపిఎం దేశంలో బలమైన రాజకీయ పార్టీగా అవతరిం చింది. రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయి. 35 సంవత్సరాల క్రితం సోవియట్ పతనం తర్వాత అమెరికా కమ్యూనిస్టులను భూస్థాపితం చేశామంది. ఇప్పుడు అదే అమెరికా కమ్యూనిస్టులే ప్రధాన శత్రువు అని చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సోషలిజం గురించి నేడు చర్చ సాగుతోంది. ఇది మంచి పరిణామం .
ప్ర: ఒకప్పుడు యువత రాజకీయాల్లో కీలకంగా ఉండేవారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
జ: కమ్యూనిస్టు పార్టీలో 20 శాతం యువత ఉంది. ఇటీవల కేరళ, బెంగాల్‌లో, మన రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సిపిఎం పాదయాత్రల్లో యువత ముందునడిచింది. నూతన ఆర్థిక విధా నాలు, విద్యా విధానంలో వచ్చిన మార్పుల ప్రభావం యువతపై ఉంది. విద్యార్థులలో సామాజిక స్పృహ కొరవడుతోంది. వ్యక్తిగత అంశాలకు కొంతకాలం యువత అలవాటు పడిన మాట వాస్తవమే. ఇటీవల కాలంలో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. యువత ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తోంది. తప్పకుండా యువత రాజకీయాల్లో రావాల్సి ఉంది. వస్తారనే నమ్మకం ఉంది.
ప్ర : చంద్రబాబు నాయుడు విజన్ 2047 గురించి పెద్ద చర్చ సాగుతోంది. దీనిపై మీరేమంటారు?
జ : విజన్ 2047 కొత్తదేమీ కాదు. విజన్ 2020 పేరుతో 1998లోనే ప్రపంచ బ్యాంక్ మద్దతుతో దానిని తీసుకొచ్చారు. నీతి ఆయోగ్, వికసిత్ భారత్ మార్గదర్శకంలో ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 తీసుకొచ్చారు. ఆ డాక్యుమెంట్‌కు, దీనికి పెద్ద తేడా కనిపించడం లేదు. ఆ రోజు ‘అందరికీ ఉద్యోగాలు, సంపద సృష్టిస్తామని. అందరికీ పంచుతామని, పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. ఇప్పుడూ అదే చెబుతున్నారు. అమెరికాలోనూ ఉద్యోగాలకు గ్యారంటీ లేదు. రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో భమ్రలు కల్పిస్తున్నారు. ఒక్కటన్నా వచ్చిందా? చంద్రబాబు దావోస్ పర్యటన వల్ల ఏ ఫలితం వచ్చింది చెప్పండి. కాగితాల్లో లెక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ప్ర : రాష్ట్రంలో బిజెపిని నియంత్రించడానికి సిపిఎం చేస్తోన్న కృషి ఏమిటి?
జ: రాష్ట్రంలో బిజెపికి ప్రజల మద్దతు లేదు. ఒక్క శాతం ఓట్లు కూడా ఇక్కడ రాలేదు. టిడిపి, జనసేనలను ఉపయోగించుకొని బిజెపి బలపడడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ఏం చెప్పదలచుకున్నావో వాటినే పవన్ కల్యాణ్‌తో మాట్లాడిస్తున్నాయి. పవన్ చెప్పినట్లు బిజెపికి రోడ్డు మ్యాప్ ఉంది. ఇందులో రహస్యం ఏమీ లేదు. టిడిపిని ఇంటికి సాగనంపి, బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే రోడ్డు మ్యాప్ లక్ష్యం. టిడిపి ఇలానే ప్రతి విషయానికీ రాజీపడితే పవన్, బిజెపి నుంచి ముప్పు తప్పదు. తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల ఉదాహరణ మనకు కనిపిస్తోంది. ఎక్కడైతే బిజెపిని ఎదిరించి , రాజకీయంగా నిలబడిన ప్రాంతీయ పార్టీలు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. బిజెపి మతోన్మాద విధానాలను తిప్పికొట్టడంలో సిపిఎం ఎప్పుడు ముందుంటుంది. ఇందులో ఏ మాత్రమూ రాజీ పడం.
ప్ర : నెల్లూరులో జరుగుతోన్న రాష్ట్ర 27వ మహాసభ ఏలాంటి నిర్ణయం తీసుకోనుంది?
జ : నెల్లూరు కమ్యూనిస్టు ఉద్యమానికి ఘనమైన చరిత్ర ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్య. వి. శ్రీహరి లాంటి ఎందరో నేతలు ఉద్యమాలు నిర్మించిన గడ్డ ఇది. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో మతోన్మాదులు పొంచి ఉన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వ విధానాలు ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రజా ఉద్యమాల బలోపేతానికి బలమైన నిర్ణయం సభలో తీసుకుంటాము. రాష్ట్రానికి ఒక దిశను ఈ మహాసభ చూపుతుందనడంలో సందేహం లేదు.