సనాతనం కాదు, సమధర్మం కావాలి

కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజలకు కావాల్సింది సనాతనం ధర్మం కాదని, సమధర్మం అని అంబేద్కర్‌ సాక్షిగా ఎలుగెత్తి చాటాలని దళిత సోషన్‌ ముక్తి మంచ్‌(డిఎస్‌ఎంఎం) జాతీయ నాయకులు, కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని కళాక్షేత్రం వద్ద ఉన్న బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఆయన శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి, కుల వ్యవస్థ నిర్మూలనకు, కుల అంతరాలకు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. సంపూర్ణ కుల నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఉందన్నారు. రాష్ట్రంలో కులాంతరాలు, విద్వేషాలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. అంటరానితనం ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కులవ్యవస్థను మరింత బలపరచడానికి లేని పవిత్రతను సనాతన ధర్మానికి అపాదిస్తున్నారని, ఇది కుల వ్యవస్థను కొనసాగించే దుష్ట ప్రయత్నమని చెప్పారు. ఇది అంబేద్కర్‌కు తీవ్రమైన అపచారం అవుతుందని చెప్పారు. టిటిడిలో సనాతన ధర్మం పేరుతో హిందువులు తప్ప మిగిలిన వారు ఉండకూడదని కొందరంటునానన్రి, వీళ్లు హిందువుల్లో ఉన్న అసమానతలను తొలగించడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. టిటిడిలో దళితులకు స్థానం లేదన్నారు. పూజారులుగా పనికిరారని, గర్భగుడిలోకి ప్రవేశం లేదన్నారు. మతం చిచ్చు రేపడానికి టిటిడిని ఒక సాధనంగా వాడుకుంటున్నారని చెప్పారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై గౌరవ హత్యలు పేరుతో సొంత కుటుంబ సభ్యులనే హత్యలు చేస్తుంటే దీని బలపరుస్తారా లేక వ్యతిరేకిస్తారా అనేది స్పష్టం చేయాలన్నారు. మతోన్మాధ సంస్థలు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవడానికే హిందూ మతాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. హిందూ మతంపై వాళ్లకు అభిమానం లేదన్నారు. అణగారిన కులాలను అణగదొక్కడానికి, అగ్రకులాల దురహంకారాన్ని కొనసాగించడానికి, నశించిపోయిన ప్యూడల్‌ వ్యవస్థను పునరుద్ధరించడానికి మాత్రమే ఆసక్తిని చూపిస్తున్నారని చెప్పారు. అలాంటి శక్తులను అణగదొక్కి కుల వ్యవస్థను నిర్మూలించేందుకు, సమాన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగాన్ని కాకుండా మను సంస్కృతిని అమలు చేసేందుకు మనువాదులు ప్రయత్నిస్తున్నారన్నారు. అలాంటి వారి చర్యలను వ్యతిరేకించాలని కోరారు. రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలన్నారు. మనువాదులు పెంచి పోషిస్తున్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పని చేయాలన్నారు. వారి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ప్రధాన లక్ష్యంతో కెవిపిఎస్‌ పని చేస్తుందన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి క్రాంతి, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న సుమమాల అధ్యక్షులు కె.భాస్కరరావు, విగ్రహ కమిటీ సభ్యులు శామ్‌, సుబ్రమణ్యం తదితరులు పాల్గన్నారు.

➡️