రాజ్యాంగ పరిరక్షణకై పోరాటానికి సన్నద్ధం కావాలి

  • కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజ్యాంగ పరిరక్షణకై పోరాటానికి ప్రజలు సన్నద్ధం కావాలని కేరళ మాజీ విద్యా శాఖ మంత్రి ఎం.ఎ బేబి అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో రామోజీరావు సాహిత్య వేదికపై మంగళవారం సాయంత్రం ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ప్రచురించిన ”రాజ్యాంగం మనకేమిచ్చింది” అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ’75 ఏళ్ల భారత రాజ్యాంగం’ అంశంపై మాట్లాడారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు మన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ రాజ్యాంగాలను రూపొందించుకున్నాయని, ఇక్కడేమో మన రాజ్యాంగంపై కొన్ని శక్తుల దాడులు చేస్తున్నాయని అన్నారు. జస్టిస్‌ హెచ్‌.ఎన్‌.నాగమోహన్‌దాస్‌ రాజ్యాంగంలోని కీలక అంశాలను గురించి ఈ పుస్తకంలో వివరించారని చెప్పారు. రాజ్యాంగ రూపకల్పనకు ఏర్పాటు చేసిన కమిటీలో మనువాదులు దేవుడి పేరుతో రాజ్యాంగాన్ని ప్రారంభించాలనే అంశాన్ని తీసుకువచ్చారని, మెజారిటీ సభ్యులు రాజ్యాంగాన్ని ‘పీపుల్‌ ఆఫ్‌ ఇండియా’ అనే పదంతోనే ప్రారంభించాలని నిర్ణయించారని గుర్తు చేశారు. మనుసకమృతిని ఆమోదించలేదు కాబట్టి ఈ రాజ్యాంగం పనకిరాదంటూ అప్పట్లో ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వ్యాసాలు ప్రచురించిందని చెప్పారు. అలహాబాద్‌ హై కోర్టు న్యాయమూర్తి శేఖర్‌ యాదవ్‌ విహెచ్‌పి కార్యక్రమంలో పాల్గొని, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడ్డం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ విషయంపై సిపిఎం నాయకులు బృందాకారత్‌ సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారని చెప్పారు. అయోధ్య కేసు విషయంలో కూడా సుప్రీం కోర్టు తీర్పులోని అనేక అంశాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్లో కొన్ని వివాదాస్పదంగా ఉన్నాయని, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఇచ్చిన అయోధ్య కేసులో తీర్పు ప్రతి కింద ఆధర్‌ అని పేర్కొనలేదని అన్నారు. ఈ కేసులో తీర్పు ఇవ్వడమే జరిగింది తప్ప న్యాయం జరగలేదని అన్నారు. సుప్రీం కోర్టు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందని, దానికి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. బాబ్రీ మసీదును కూల్చడం నేరం, కూల్చిన వారు నేరస్తులు, కానీ, కోర్టు వారికే ఆ స్థలాన్ని అప్పగిస్తూ తీర్పు ఇచ్చిందని అన్నారు. అధికార పార్టీకి అత్యధిక మెజారిటీ ఉన్నప్పుడు పార్లమెంట్‌ రాజ్యాంగాన్ని కాపాడటంతో విఫలం కావచ్చు, కానీ, జుడిషియరీపై రాజ్యాంగాన్ని కాపాడాల్సి బాధ్యత ఉందన్నారు. రాజ్యాంగం మనకేమిచ్చింది పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, బంధుమిత్రులకు బహుకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి జెజవాడ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు సంపర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ జిఎం కె.లక్ష్మయ్య, విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ జిఎం మనోహర్‌ నాయుడు, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ మేనేజర్‌ బి.శ్రీనివాస్‌, వర్కింగ్‌ ఎడిటర్‌ వరప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️