– ఐదేళ్లలో గ్రామాల్లో మూడు సెంట్లు జాగా ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం
– సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే సహించం
– ఆగిరిపల్లి పి-4 ప్రజావేదిక సభలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఇళ్లు లేని వారందరికీ గ్రామాల్లో మూడు సెంట్లు స్థలమిచ్చి ఇళ్లు కట్టించిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తామని, ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదని, అందరికీ ఇళ్లు కట్టే కార్యక్రమం పెద్దఎత్తున చేపడతామని, గత ప్రభుత్వం నివాసానికి అనుకూలంగా లేని చోట స్థలాలిచ్చి మోసగించిందని సిఎం చంద్రబాబు అన్నారు. జ్యోతిరావుఫూలే జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి సచివాలయం-2 పరిధిలో శుక్రవారం పి-4 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా కుల వృత్తులు చేసుకుంటున్న కుటుంబాలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ యార్డుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం పి-4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో మాట్లాడుతూ..ఫూలే జయంతి రోజున పి-4 కార్యక్రమం ప్రారంభించుకుంటున్నామన్నారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు పెంచుతామని, నామినేటెడ్ పోస్టుల్లో 33 శాతం అమలు చేస్తామని తెలిపారు. నేరస్తులకు సోషల్ మీడియా అడ్డాగా మారిందని, ఎవరి వ్యక్తిత్వాన్ని కించపరిచినా వాళ్లకు అదే చివరిరోజు అవుతుందని హెచ్చరించారు. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న పది శాతం మంది అట్టడుగున ఉన్న 20 శాతం పేదలను పైకి తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. తయారవుతారన్నారు. ఆగిరిపల్లిలోని 206 కుటుంబాలకు వారి మార్గదర్శకులు అండగా ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో మొదటిదశలో 20 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి పైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. బంగారు కుటుంబాలకు ఎంపికైన ప్యారీ రేష్మ, బోనం లక్ష్మిదుర్గ మాట్లాడారు. బంగారు కుటుంబాలకు సాయం చేసేందుకు వచ్చిన మార్గదర్శకులు నూజివీడు అధినేత ప్రభాకర్, హ్యాపీవ్యాలీ స్కూల్ డైరెక్టర్ కోటేశ్వరరావు, కుశలవ గ్రూప్‌కు చెందిన సిద్ధార్ధ, నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ అధినేత నితిన్ కృష్ణ, మోడల్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పిన్నమేని ధనప్రకాష్, ఎన్‌ఆర్‌ఐ కాలేజీ చైర్మన్ రావి వెంకట్రావు మాట్లాడుతూ… నిరుపేద కుటుంబాలకు అండగా ఉండి పైకి తీసుకొస్తామన్నారు. అనంతరం టిడిపి నాయకులు, కార్యకర్తలతో సిఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సిఎంను కలిసిన కోకో రైతులు
కోకోపంటకు సరైన ధరలేక ఇబ్బంది పడుతున్న రైతులు సిఎంను కలిసేందుకు రాగా పోలీసులు అనుమతించలేదు. దీంతో సభ ముగిసిన తర్వాత ఎంపి పుట్టా మహేష్ రైతులను కలిసి వారితో మాట్లాడి, సిఎం వద్దకు తీసుకువెళ్లారు. సిఎంకు కోకో రైతులు తమ సమస్యను వివరించారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సిఎం వారికి హామీ ఇచ్చారు.