- పాలకోడేరు బాధితులకు అఖిలపక్షం భరోసా
ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : ‘నిరుపేదలు మనుషులు కాదా.. ఇంత దారుణంగా ఇళ్లు కూల్చేస్తారా.. అడ్డుకుంటే పోలీసులతో నెట్టేస్తారా.. ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. రాచరిక పాలనలో ఉన్నామా’ అని ప్రభుత్వాన్ని అఖిలపక్షం ప్రశ్నించింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులోని ఎఎస్‌ఆర్ నగర్‌లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నేతలతోపాటు ప్రజాసంఘాల నేతలతో కూడిన అఖిలపక్షం శుక్రవారం పర్యటించింది. కూలగొట్టిన ఇళ్లను పరిశీలించింది. శిథిలాల మధ్య నివశిస్తున్న బాధితులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఇళ్ల నిర్వాసితులు తమ సమస్యలను అఖిలపక్షం నాయకులకు విన్నివించుకున్నారు. అధైర్య పడొద్దు.. సమస్య పరిష్కారమయ్యే వరకూ తాము తోడుంటామని నిర్వాసితులకు నేతలు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.వాసుదేవరావు, సిపిఐ జిల్లా నాయకులు మల్లుల సీతారాం ప్రసాద్, బ్రహ్మం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్ర శ్రీనివాస యాదవ్, పుచ్చకాయల రత్నంరాజు, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు దండు శ్రీనివాసరాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.పూర్ణ మాట్లాడుతూ.. చట్ట ప్రకారమే పేదల ఇళ్లు తొలగిస్తున్నామని బహిరంగంగా చెబుతున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మహిళలను మగ పోలీసులతో ఈడ్చేయొచ్చని ఏ చట్టంలో ఉందో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా జరిగిన నష్టాన్ని గుర్తించి ప్రజలకు ఇళ్లు నిర్మించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష నేతలు ఎఎస్‌ఆర్ నగర్‌లో పర్యటిస్తున్న సందర్భంలో ఎగువ భాగాన ఉన్న రొయ్యల చెరువులో నీటిని మోటార్లతో రాజు కాల్వలోకి వదులుతుండడాన్ని గమనించారు. దీంతో, సంబంధిత చెరువు యజమానులు మోటార్లను ఆపి తనకేమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక్కడ నివాసాలే కాలుష్యానికి కారణమని చెబుతున్న డిప్యూటీ స్పీకర్ బహిరంగంగా కాలువలోకి ఆక్వా చెరువుల నీటిని వదిలేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నాయకులు నిలదీశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.