‘సరస్వతి’ భూములపై విచారణ చేపడతాం

  • దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ
  • ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

ప్రజాశక్తి-పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) : ప్రజలకు, ప్రభుత్వానికి చెందిన భూములను లాక్కొని అవేదో తమ సొంత ఆస్తిలా జగన్‌ కుటుంబ సభ్యులు కోర్టుల్లో కొట్టుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలోని సరస్వతి పవర్‌ ప్లాంట్‌ భూములను స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. సరస్వతి పవర్‌ ప్లాంట్‌ కోసం 2007-08లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రైతుల నుండి 1184 ఎకరాలతోపాటు చుక్కల భూమి 77 ఎకరాలు, అసైన్డ్‌ భూమి 24 ఎకరాలు తీసుకున్నారని తెలిపారు. సగానికిపైగా భూములు బెదిరించి లాక్కున్నవేనని, 400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ భూములుగా మార్చి దోచుకున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. సరస్వతి పవర్‌ ప్లాంట్‌ కింద ఎంత భూమి ఉంది, ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగాయనే దానిపై విచారణ చేయాలని సంబంధిత ఆధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల కింద మరో 23.4 ఎకరాలను దోచుకున్నారని విమర్శించారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోగా ఆ భూములను అమ్ముకున్నారని, ప్రశ్నించిన రైతులపై బాంబులు, మారుణాయుధాలతో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ పేరుతో కృష్ణా నది నుండి 196 కోట్ల లీటర్ల నీరు వాడినట్లు చూపుతున్నారని, లేని ఫ్యాక్టరీకి నీటిని ఎలా ఉపయోగించారని ప్రశ్నించారు. ఈ విషయంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. సరస్వతి భూముల విషయంలో గతంలో ఈ ప్రాంతంలో రైతులపై అనేక దాడులు జరిగాయని, ఇకపై వారికి ఏ ఇబ్బంది కలిగినా జిల్లా ఎస్‌పిదే బాధ్యతని తెలిపారు.

➡️