- దీపావళికి ఉచిత గ్యాస్
- కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు ప్రతిపాదనలు
- ప్రజావేదిక’లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : గ్రామ/వార్డు వలంటీర్లను తీసుకునేందుకు ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో మంగళవారం జరిగిన ప్రజావేదిక సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయా నికి చేరుకున్న ఆయన అక్కడి నుండి హెలికాప్టర్‌లో పుచ్చకాయల మాడకు చేరుకున్నారు. తలారి గంగమ్మ, వెంకటేష్ ఇళ్లకు వెళ్లి వారికి పింఛను అందజేశారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ డిసెంబర్‌లో డిఎస్‌సి నిర్వహిస్తామన్నారు. డిసెంబర్‌లోపు నైపుణ్య గణన చేస్తామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పింఛను నాలుగు వేల రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా ఎపి ఉందన్నారు. ఇప్పటి వరకు రూ.12,508 కోట్ల పింఛన్లను ఇచ్చామని తెలిపారు. వంద రోజుల్లో చాలా కార్యక్రమాలు చేశామన్నారు. రాష్ట్రం కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి రావాల్సి ఉందని తెలిపారు. పది లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉందని, లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తోందని, ఎక్కడి నుండి తేవాలో అర్థం కాలేదని అన్నారు. ఎంపీలు మనపట్ల సంజీవనిగా మారారని, రాష్ట్రానికి సంబంధించిన పనులను కేంద్ర ప్రభుత్వం చేసే పరిస్థితి తెచ్చామని వివరించారు.
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రాయలసీమ
రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా చేస్తామని, 7.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. హంద్రీనీవా నీళ్లు బిందు సేద్యం ద్వారా పొలాలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి పెన్నాకు అనుసంధానం చేయగలిగితే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని వివరించారు. గుండ్రేవుల, ఆర్‌డిఎస్, గురురాఘవేంద్ర ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఓర్వకల్లుకు పరిశ్రమలు తెస్తామని, కర్నూలు-బళ్లారి రహదారిని జాతీయ రహదారి చేస్తామని హామీ ఇచ్చారు. తనకు వచ్చిన అర్జీలలో 50 శాతం భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. భూమి వేరే వాళ్ల పేరున రాసేసుకున్నారని అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ చట్టం చేశామని, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. ఐవిఆర్‌ఎస్ ద్వారా కలెక్టర్లు, ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకుంటామని తెలిపారు. నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందిస్తామన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్, ఎంపి బస్తిపాటి నాగరాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మాజీ మంత్రులు కెఇ ప్రభాకర్, గుమ్మనూరు జయరాం, పత్తికొండ ఎమ్మెల్యే కెఇ.శ్యాంబాబు, కలెక్టర్ పి.రంజిత్ బాషా, గ్రామ సర్పంచి హారిక, ఎంపిటిసి సభ్యులు చంద్ర పాల్గొన్నారు.