వైసిపిలో చేరిన అనంతరం సాకే శైలజానాథ్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని, వారి తరపున పోరాడేందుకే వైసిపిలో చేరానని పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ తెలిపారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని వైసిపి క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్వీర్యం చేయడం ద్వారా పేదలకు విద్యను దూరం చేశారన్నారు. విద్యారంగంలో జగన్ చేసిన సంస్కరణలను పక్కనబెట్టారని, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. రాయలసీమలో రైతుల కష్టాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వైసిపి సీనియర్ నాయకులు అనంతవెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. శైలజానాథ్ పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో పెద్దయెత్తున చర్చ సాగుతోందని పేర్కొన్నారు. రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకొస్తానని చెబుతున్నది అబద్ధమన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఆ ప్రాంతానికి మోసం చేశారని విమర్శించారు.
