- రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ఆవిర్భావం నుండి తాము జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటే వున్నామని, తాము పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేయడం తగదని వైసిపి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. తాము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వున్నపుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వెన్నంటే వున్నామని, 2011 నుంచి జగన్ వెన్నంటే వుండాలని వైసిపిలో వున్నామని తెలిపారు. తమ వ్యక్తిత్వంపై బురద జల్లేలా పార్టీ మారుతున్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. తమ సహచర రాజ్యసభ సభ్యులైన మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు కూడా ఈ సమావేశానికి రావాల్సి వుందని, వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నామని, తాము కూడా జగన్ వెన్నంటే వుంటామని వారు తెలిపారని అన్నారు. వైసిపి మళ్లీ పుంజుకుంటుందన్నారు. మోపిదేవి వెంకట రమణ అంటే తమకు ఎంతో గౌరవమని, ఆయనకు జగన్ ఎంతో విలువ ఇచ్చారని, అయినా పార్టీని వీడటం తమను బాధించిందన్నారు. తమను కూడా పార్టీలోకి రమ్మని కొన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయని, వైసిపిలోనే వుంటామని వారికి తేల్చి చెప్పామని తెలిపారు.