- రాజధాని రైతులతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ
- రుణమా? గ్రాంటా అనేది కేంద్రం నిర్ణయం : సిఆర్‌డిఎ కమిషనర్
ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు జిల్లా) : రాజధాని రైతులతో ప్రపంచ బ్యాంకు, ఎడిబి ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధానిలో చేపట్టే పలు ప్రాజెక్టులపై తుళ్లూరులోని హెచ్‌ఎస్‌ఆర్ కల్యాణ మండపంలో శనివారం రైతులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణానికి తమ సహకారం ఉంటుందని చెప్పారు. సిఆర్‌డిఎ కమిషనర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ.. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని, కేవలం నాలుగు నెలల్లో అమరావతి నిర్మాణానికి రుణం పొందే అవకాశం కలిగిందని చెప్పారు. 11న ఢిల్లీలో ప్రపంచ బ్యాంకుతో అగ్రిమెంట్ చేసుకోనున్నామని, ప్రపంచ బ్యాంకు ఇచ్చే రూ .15 వేల కోట్లతో పాటు వివిధ సంస్థల నుంచి మరో రూ.15వేల కోట్లు రుణం పొందనున్నామని తెలిపారు. రహదారులు, భవన, గృహ నిర్మాణాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా యువత, మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన లాంటి చర్యలు తీసుకుంటామని, తద్వారా బ్యాంకుల నుంచి దశల వారీగా సాయం అందుతుందని చెప్పారు. కేటాయించే సొమ్ము రుణమా, గ్రాంటా అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. రుణాలు రాగానే రాజధాని నిర్మాణ పనులు మొదలవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు వారెన్‌పాల్, గెరల్డ్ పాల్, సుదీప్ మోజుందార్, సోనా ఠాకూర్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎడిబి) ప్రతినిధులు ప్రవాష్‌కుమార్ మిశ్రా, హర్షవర్థన్ సింగ్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సిఆర్‌డిఎ అదనపు కమిషనర్ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలుపార్టీల నాయకులు, రాజధాని జెఎసి నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు.
అప్పుకాదు.. గ్రాంటుగా ఇవ్వాలి : బాబూరావు
రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు అప్పుకాదు.. రూ.15వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. రాజధాని రైతులపై కేసులు ఎత్తివేయాలని, రైతులకు కౌలు, కూలీల పెన్షన్ మరో పదేళ్లు పొడిగించాలని కోరారు. దళిత, బలహీన వర్గాల అసైన్డ్ భూములకు సమాన ప్యాకేజీ ఇవ్వాలని, భవిష్యత్తులో రాజధానిపై అనిశ్చితి లేకుండా చట్టబద్ద వ్యవస్థీకృతమైన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాలని, రాజధాని ప్రాంతంలో టిడ్కో, తదితర గృహ నిర్మాణ పథకాలు అమలు చేయాలని కోరారు. రాజధానిలో 42 కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని, ఉపాధి కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంస్థలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కమిటీలు ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
యువత, మహిళలకు ప్రాధ్యాన్యం ఇవ్వాలి : జెఎసి నాయకులు
రాజధాని ప్రాంతంలో యువత, మహిళల ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని రాయపూడి గ్రామానికి చెందిన జెఎసి నాయకులు కంభంపాటి శిరీష, జొన్నలగడ్డ కిరణ్ కుమార్ కోరారు. సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడారు.