ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఫైబర్‌నెట్ కనెక్షన్లను రానున్న రెండేళ్లలో 50 లక్షలకు పెంచుతామని ఎపి ఫైబర్‌నెట్ సంస్థ ఛైర్మన్ జివి రెడ్డి తెలిపారు. గత ఐదేళ్లలో 5 లక్షలకు కనెక్షన్లు పడిపోయాయని అన్నారు. విజయవాడలోని ఎన్‌టిఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోని ఫైబర్‌నెట్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను అందించాలని 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైబర్‌నెట్‌ను ప్రారంభించారని వెల్లడించారు. 2019 నాటికి పది లక్షల కనెక్షన్లు ఉండగా, ఇప్పుడు ఐదు లక్షలే ఉన్నాయని చెప్పారు. పది రెట్లు పెరగాల్సిన కనెక్షన్లు సగానికి తగ్గి సంస్థ దివాళా అంచుకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనెక్షన్లు ఎందుకు తగ్గాయో అర్థం కావడం లేదన్నారు. ఆదాయం వచ్చే సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టారని, రూ.1,262 కోట్లకు అప్పులు చేరాయని వెల్లడించారు. నియామక పత్రాలు లేకుండా సంస్థలో ఉద్యోగాలిచ్చారని, వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకుండా ఉందన్నారు. అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగించి పూర్తి పారదర్శకంగా నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చిన వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కరెంట్ పోల్స్‌కు ఉన్న వైర్లను తొలగించి కేబుల్ ఆపరేటర్లను విద్యుత్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, ఇది సరికాదని తెలిపారు. గతంలో వ్యూహం సినిమాకు రూ.2.15 కోట్లు సంస్థ తరపున చెల్లించారన్నారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా సంస్థతో ఒప్పందం జరిగిందని, కానీ 1863 మాత్రమే వచ్చాయని వివరించారు.
