కనెక్షన్లు వెంటనే పునరుద్ధించకపోతే ఉద్యమిస్తాం

  • దళితుల ఇళ్లకు కరెంటు కనెక్షన్ల తొలగింపు అన్యాయం
  • ఎమ్మెల్యే ఆదేశాలు పాటిస్తున్నామని చెప్పడం విడ్డూరం : అండ్ర మాల్యాద్రి

ప్రజాశక్తి – కాళ్ల : దళితుల ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు తొలగించడం అన్యాయమని, వాటిని వెంటనే పునరుద్ధరించకపోతే ఉద్యమిస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్లలోని లంక రోడ్డులో ఉన్న దళితుల ఇళ్లను సోమవారం కెవిపిఎస్‌ బృందం పరిశీలించి, బాధితులను పరామర్శించింది. అనంతరం అధికారులతో ఫోన్‌లో మాల్యాద్రి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళ్ల లంక రోడ్డులోని పది దళిత కుటుంబాలకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా దుర్మార్గంగా కరెంటు కనెక్షన్లు తొలగించడం అన్యాయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదేశాల ప్రకారమే దళితుల ఇళ్లకు కరెంట్‌ కట్‌ చేశామని, పంచాయతీ, ఆర్‌అండ్‌బి అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఎలక్ట్రికల్‌ ఎఇ, పంచాయతీ అధికారులు కుమ్మక్కె కరెంటును కట్‌ చేశారని, తక్షణం వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల విజయకుమార్‌, కె క్రాంతిబాబు, సిఐటియు జిల్లా నాయకులు గొర్ల రామకృష్ణ, బాధితులు పద్మారావు, విజరుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️