పంటకు మద్దతు ధర కల్పిస్తాం..రైతులెవరు దళారులను ప్రోత్సహించవద్దు : మంత్రి మనోహర్

Nov 28,2024 17:39 #manohar

రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తాం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. గురువారం కృష్ణా జిల్లాలో  ఆయన పర్యటించారు.  పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపురాశులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతుందంటూ వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… ధాన్యం విక్రయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం.  క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నాం.  రైతులకు నమ్మకం కలిగించేలా.. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళమని మేము అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ధాన్యం విక్రయించిన 24 గంటల్లో.. రైతుల ఖాతల్లో నగదు జమ చేస్తున్నాం. 24 శాతం తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేలా మిల్లర్లకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం.  రైతుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని.. సాయంత్రానికల్లా గుడివాడలో 30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ ఇబ్బందులు తలెత్తకుండా.. బకాయి నిధులు విడుదల చేశాం. కొత్త ఆలోచనతో 1:2 నిష్పత్తిలో రైతులకు బ్యాంక్ గ్యారంటీ వెసులుబాటు కల్పించాం. రైతు సహాయ కేంద్రాలను సంప్రదిస్తే.. కల్లాల వద్దకే గోనేసంచెలు.. రవాణా వాహనాలను పంపించేలా ఏర్పాటు చేశాము’ అని అన్నారు. అయితే ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేసినా.. రైతులెవరు దళారులను ప్రోత్సహించవద్దు అని మంత్రి మనోహర్ సూచించారు.

 

➡️