- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్య పోరాటాలతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఎన్.రామచంద్రరావు, గోపి అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1394వ రోజుకు చేరాయి. దీక్షల్లో ఐఎన్‌టియుసి కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను నిలుపుదల చేసి, కర్మాగారానికి తగిన ముడిసరుకు అందజేయాలని, కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను నడపాల్సిన కేంద్ర సర్కారే వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నడం దారుణమన్నారు. కార్మికుల శక్తిని తక్కువ అంచనా వేయొద్దని, విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు కార్మికులు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.