భూ ఆక్రమణదారుల నుంచి ‘ఓటేరు’ను కాపాడతాం

  • సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

ప్రజాశక్తి -తిరుపతి సిటీ : భూ ఆక్రమణదారుల నుంచి ఓటేరు చెరువును కాపాడి తీరుతామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. చెరువు ఆక్రమణ తొలగించే వరకు పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశారు. తిరుపతిలోని ఓటేరు చెరువును ఆయన బుధవారం పరిశీలించారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే చెరువును పూడ్చేందుకు కబ్జాదారులు యత్నించిన వైనాన్ని ఆయనకు సిపిఐ, సిపిఎం, ఆర్‌పిఐ నాయకులు వివరించారు. తొలుత నీటిని నదిలోకి మళ్లించి ప్రణాళికబద్ధంగా జాతీయ రహదారిపై ఉన్న ఆక్రమణకు యత్నించిన వైనాన్ని పరిశీలించారు. తొలి రోజు నుంచి వామపక్ష పార్టీలు చెరువు వద్ద నిరసన తెలపడంతో ఆక్రమణ ఆగినట్లు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ దుర్మార్గంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడడం దారుణమన్నారు. తిరుపతిలో అనేక చెరువులు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయని, బ్రిటీష్‌ కాలం నాటి ఓటేరు చెరువును ఆక్రమించేందుకు ఒడిగట్టడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత అంటాడని, చెరువులు పూడ్చేసి కబ్జా చేస్తుంటే చూస్తూ ఉంటారని, ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. పరిసర ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెరువును ఆక్రమణదారుల నుంచి విముక్తి కలిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆక్రమిత చెరువు భాగాన్ని పూడిక తీయించి చెరువును సుందరీకరణ చేపట్టి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రామానాయుడు, ఓటేరు చెరువు పరిరక్షణ వేదిక కన్వీనర్‌ కే పద్మనాభ రెడ్డి, సిపిఎం నాయకులు హేమలత, జయచంద్ర, ఆర్‌పిఐ నాయకులు పి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️