- డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి హామీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరిస్తామని స్త్రీ, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్ప్‌ర్స్ యూనియన్ (సిఐటియు), ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఎఐటియుసి), ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) సంఘాల నాయకులతో గుంటూరులోని డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం చర్చలు జరిపారు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ చర్చల్లో పలు అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు. అంగన్‌వాడీల వేతనాల పెంపు, గ్రాట్యూటీ అమలుపై ముఖ్యమంత్రి, మంత్రితో చర్చించి త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ వారికి హామీ ఇచ్చారు.
మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చేందుకు త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. హెల్పర్ల ప్రమోషన్ మార్గదర్శకాలు రూపొందించి వెంటనే అర్హులందరికీ ప్రమోషన్లు ఇస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న సిబి ఈవెంట్స్, అద్దెలు, టిఎ బిల్లులు వెంటనే ఇస్తామని, కేంద్రాలకు మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్ బిల్లులకు బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. వివిధ రకాల యాప్‌లను ఒక యాప్ కింద తీసుకొస్తామన్నారు. బాలసంజీవని యాప్‌లో చేస్తే పోషణ ట్రాక్టర్ యాప్‌లో కూడా నమోదయ్యే విధంగా కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. రికార్డు వర్క్ తగ్గిస్తామని, ఒటిపి రద్దు చేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 164 పోస్టుల భర్తీ, మెనూ ధరల పెంపు, పిల్లలకు సాయంత్రం స్నాక్స్, యూనిఫాం ఒకే కలర్, వేతనంతో కూడిన మెడికల్ లీవు, వేసవి సెలవులు, పెండింగ్ వేతనాలు వంటి అంశాలను పరిష్కరించేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. సుమారు 4 గంటల పాటు యూనియన్లతో డైరెక్టర్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో శాఖ జాయింట్ డైరెక్టర్ మనోరంజన్, సిఐటియు అనుబంధం యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె సుబ్బరావయ్య, జి బేబిరాణి, నాయకులు ఎన్‌సిహెచ్ సుప్రజ, లక్ష్మీదేవి, షీబా, దీప్తి, మనోజ్, ఎఐటియుసి అనుబంధ యూనియన్ నుంచి జె లలితమ్మ, మంజుల, ప్రేమ, ఐఎఫ్‌టియు యూనియన్ నుంచి ఎఆర్ జ్యోతి, భారతి, పి శోభ, ఎస్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.