మంత్రి ఫరూక్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ ఖాజీల సమస్యలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ తెలిపారు. సచివాలయంలో ప్రభుత్వ ఖాజీల ప్రతినిధులతో ఆయన గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన మైనార్టీల సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఖాజీలందరూ నైతికతతో న్యాయంగా సేవలందించాలని, చట్ట పరిధిలో పనిచేసి మన్ననలు పొందాలని సూచించారు. ఖాజీల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఖాజీల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరిస్తూ… ప్రస్తుతం ఒక ప్రభుత్వ ఖాజీ ఉన్నచోట మరొకరిని, లేదా అదనపు ఖాజీని నియమించకూడదన్నారు. గత ప్రభుత్వం ఖాజీల చట్టానికి విరుద్ధంగా నియోజకవర్గానికి ఒకరి కంటే ఎక్కువ సంఖ్యలో ఖాజీలను నియమించిందని చెప్పారు. ఉన్నవారికి కాలపరిమితిని తొలగించి క్రమబద్ధీకరించాలని కోరారు. ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో ఉర్దూను ద్వితీయ భాషగా పరిగణించాలన్నారు. ఖాజీల అవసరాలకు తగ్గట్టుగా మొబైల్ యాప్ రూపొందించాలని కోరారు. వక్ఫ్ బోర్డు నుంచి వివాహ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని, తమిళనాడు తరహాలో ప్రభుత్వ ఖాజీలకు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుల్హన్ పథకం కింద ప్రయోజనం పొందేందుకు గత ప్రభుత్వం విధించిన అసమంజస నిబంధనల్లో మార్పులు చేయాలని కోరారు.
