- ధాన్యం కొనుగోళ్లపై సిఎం ఆదేశం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు ఇబ్బందులు పడితే దానికి కారణమైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరిచారు. ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రకియను పూర్తి చేయాలని చెప్పారు. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం, రైస్‌మిల్లర్ల సహాయ నిరాకరణ వల్ల రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశామని, అందుకే ఈ సారి ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ఈ విధానాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కింద స్ధాయి ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బందిపై ఉందని ఆయన పేర్కొన్నారు. డ్రైయ్యర్లు ( ధాన్యం ఆరబెట్టే యంత్రాలు) ఏర్పాటు ద్వారా తేమ విషయంలో తలెత్తుతున్న సమస్యలను అధిగమించవచ్చన్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, నేటి వరకు 1.51లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,331 కోట్లు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ జరిగిందని, ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుతో రికార్డు సాధించినట్లు సిఎం తెలిపారు. ధాన్యం అమ్మే రైతులు ఏ మిల్లుకైనా ధాన్యం పంపించవచ్చని, గతంలో ప్రభుత్వం సూచించిన మిల్లులకు మాత్రమే రైతుల ధాన్యం పంపాల్సి ఉండేదన్నారు.
బియ్యం స్మగ్లింగ్‌ను సహించం
రాష్ట్రంలో రేషన్ బియ్యం రీ సైక్లింగ్,స్మగ్లింగ్ అనేది పెద్దమాఫియాగామారిపోయిందని, అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని సిఎం స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం అధికారయంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్,మంత్రులు నాదెండ్ల మనోహర్, కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.