సంక్షోభం దిశగా పశ్చిమాసియా

  • పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలి
  • ‘పశ్చిమాసియా సంక్షోభం’పై సదస్సులో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : సొంత గడ్డపై బతకడం కోసం జీవన పోరాటం సాగిస్తున్న పాలస్తీనా ప్రజలకు మన దేశం యావత్తు అండగా నిలవడమే గాక మనదేశంలో మత ఉన్మాదంతో పాలన సాగిస్తున్న మోడీ విధానాలపై పాలస్తీనియన్ల స్ఫూర్తితో పోరాడాలని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ పిలుపునిచ్చారు. ‘పశ్చిమాసియా సంక్షోభం’పై విశాఖ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో రిటైర్డ్‌ అధ్యాపకులు కె.పద్మ అధ్యక్షతన గురజాడ అధ్యయన వేదిక, అల్లూరి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యాన జరిగిన సదస్సులో శర్మ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికన్‌ సామ్రాజ్యవాదం అండతో పౌరులు, నివాస ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ తెగబడుతూ గల్ఫ్‌ దేశాలను నిప్పుల కుంపటిగా మార్చేస్తోందన్నారు.

మనదేశంలో మతోన్మాదంతో చెలరేగిపోతున్న ప్రధాని మోడీకి, అక్కడ జాత్యాహంకారంతో రెచ్చిపోతున్న నెతన్యాహూకీ తేడా ఏమీలేదన్నారు. గాజాపై అనైతిక దాడులను, ఇజ్రాయెల్‌ జాత్యాహంకారాన్ని ఖండిస్తూ ప్రపంచంలోని అన్ని దేశాల రాజధానుల్లోనూ నిరసనలు జరగ్గా మనదేశంలోని న్యూ ఢిల్లీకి ఏమీ పట్టలేదన్నారు. పాలస్తీనా తదితర ప్రాంతాల్లో విలువైన బంగారం నిల్వలు, ముడిచమురును గుప్పెట్లో పెట్టుకునే వ్యూహం ఇజ్రాయిల్‌ – అమెరికాకు ఉన్నందునే యుద్ధాన్ని సాగదీస్తున్నాయ న్నారు. మన దేశంలో ముస్లిములపై మోడీ, సంఘ పరివార్‌ శక్తులు దాడులు చేసినట్టే పాలస్తీనావాసులపై నెతన్యాహూ దాడులతో విరుచుకుపడుతున్నాడన్నారు. ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ క్షేత్రపాల్‌ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా తీసుకెళ్తోందన్నారు. భారతీయులు గల్ఫ్‌ దేశాల్లో కోటి మందికిపైగా వివిధ పనుల్లో ఉన్నారని, వారంతా దేశానికి వస్తే నిరుద్యోగం ఇక్కడ ఇంకా పెరగదా ? అని ప్రశ్నించారు. రిటైర్డ్‌ ఎయు ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.నళిని మాట్లాడుతూ.. 12 నెలలుగా ఇజ్రాయిల్‌ బాంబు దాడులతో పాలస్తీనాలో పిల్లలు, మహిళలను వేల సంఖ్యలో పొట్టన పెట్టుకుందని ఆవేదన చెందారు. యుద్ధం అంటే సైన్యం మరో సైన్యంతో తలపడాలని, కానీ పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ పౌరసమాజంపై విరుచుకుపడడం విస్మయం కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు అష్రఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️