– పథకాలకు తప్పనిసరి చేసిన వైసిపి సర్కార్
– లక్షలాదిగా ప్రభుత్వ సాయాన్ని కోల్పోయిన రైతులు, కౌల్దార్లు
-తమను నష్టపర్చిన విధానం వద్దంటున్న అన్నదాతలు
– కూటమి గవర్నమెంట్ వైఖరిపై ఎదురుచూపు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి :రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఇన్నాళ్లూ తీవ్ర ప్రతిబంధకంగా తయారైన ‘ఇ-క్రాప్’ అంశం టిడిపి కూటమి సర్కారు రాకతో చర్చల్లోకొచ్చింది. కొత్త ప్రభుత్వ వైఖరేంటన్న ప్రశ్నలు తలెత్తాయి. సున్నా వడ్డీ రుణాలు, పంటల బీమా, విపత్తుల వలన పంటలు నష్టపోతే అందించే ఇన్‌పుట్ సబ్సిడీ, చివరికి పండించిన పంటలను రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోడానికి, ఇంకా పలు సర్కారీ స్కీంలన్నింటికీ గత వైసిపి ప్రభుత్వం ఇాక్రాప్‌ను తప్పనిసరి చేసింది. ఇాక్రాప్ డిజిటల్ పోర్టల్‌లో రైతులు తమ వివరాలన్నింటిని సక్రమంగా నమోదు చేసుకుంటేనే పథకాలు వర్తిస్తాయని షరతు పెట్టింది. ఇాక్రాప్‌లో రైతుల పేర్లు సరిగ్గా నమోదు కానందున లక్షలాది మంది అర్హులైన రైతులు పలు పథకాలకు దూరమయ్యారు. ప్రభుత్వ సాయాన్ని కోల్పోయారు. కౌలు రైతులకు సరైన గుర్తింపు లేనందున రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్నవారి పరిస్థితి మరీ దారుణం. ఈ నేపథ్యంలో ఇాక్రాప్ విధానాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, లేదంటే పాత పద్ధతుల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి న్యాయం చేస్తుందా అనే విషయాలపై అన్నదాతల్లో చర్చ సాగుతోంది. వైసిపి ప్రభుత్వ పలు విధానాలను సమీక్షిస్తున్న కూటమి సర్కారు, రైతులకు అన్యాయం చేస్తున్న ఇాక్రాప్‌పై ఆలోచించాలన్నది రైతుల నుంచి వ్యక్తమవుతున్న కోరిక. దీనిపై ఎన్నికైన అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను ఇాక్రాప్‌పై వైఖరేంటని చాలా చోట్ల అడుగుతున్నారు.
లోపభూయిష్టం
వైసిపి సర్కారు గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) సిబ్బందితో డిజిటల్ పోర్టల్ ఇ-పంటలో వివరాలు నమోదు చేయించింది. వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను సపోర్టుగా తీసుకుంది. రైతుల పొలాల వద్దకెళ్లి ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లలో ఫొటోలు తీసి ఇ-క్రాప్‌లో అప్‌లోడ్ చేయమంది. రెవెన్యూశాఖ డెవలప్ చేసిన వెబ్‌ల్యాండ్ పోర్టల్‌లో రైతుల పేర్లు లేకపోతే ఇ-క్రాప్‌లో సాగుల వివరాలు నమోదు కావు. దాంతో కౌలు రైతులు ఇ-క్రాప్ బయటనే ఉండిపోయారు. ప్రభుత్వం జారీ చేసిన సిసిఆర్ కార్డు రెవెన్యూ రికార్డులలో నమోదు చేసి ఉంటే అప్పుడు కౌలు రైతుల పేర్లు ఇ-క్రాప్‌లో ఎక్కుతాయి. సిసిఆర్‌సిల జారీ నామమాత్రంగానే జరిగినందున కౌలు రైతులు ఇ-క్రాప్‌లో ఎక్కే అవకాశాలు చాలా తక్కువ. ఆధార్ అథంటికేషన్, ఇకెవైసి.. ఇలా ఎన్నో షరతులు ఇ-క్రాప్‌కు పెట్టారు. వ్యవసాయ, రెవెన్యూశాఖల జాయింట్ అజమాయిషీ అన్నారు. విలేజి అగ్రికల్చర్ అసిస్టెంట్ (వివిఎ) మొదలుకొని జిల్లా వ్యవసాయాధికారి (డిఎఒ) వరకు, విలేజి రెవెన్యూ ఆఫీసర్ (విఆర్‌ఒ) మొదలుకొని కలెక్టర్ వరకు వివిధ దశల్లో చెకింగ్‌లు, సూపర్ చెక్స్ అన్నారు. తుదకు ఆర్‌బికెలలో సోషల్ ఆడిట్ అని చెప్పారు. సర్కారీ షరతులు, డేటా ఎంట్రీలో లోపాలు, సిబ్బంది చేసిన తప్పిదాలు… వెరశి లక్షల్లో సొంత భూమి కలిగిన అర్హులైన రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సాయాన్ని కోల్పోయారు.
అన్ని విదాలా అన్యాయం
ఇాక్రాప్ లేనందున బ్యాంకుల్లో రుణాలు రాలేదు. సున్నా వడ్డీ పొందలేకపోయారు. పంటల బీమా దక్కలేదు. పంటలు అమ్ముకోలేక దళారులకు, వ్యాపారులకు తెగనమ్ముకున్నారు. కరువు, తుపాన్లు, వరదల వలన పంట నష్టాలు జరిగిన సందర్భంలో ప్రభుత్వం అందించిన పెట్టుబడి రాయితీ కోల్పోయారు. రైతులను, కౌలు రైతులను అన్ని విధాలా నష్టపరిచిన ఇాక్రాప్ రద్దుపై కూటమి సర్కారు ఆలోచించాలన్నది అన్నదాతల ఆకాంక్ష.
