అంగన్వాడీ-ఆశా వర్కర్లకు ఎన్నికల అలవెన్సులు ఏవి ?

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈ నెల 13 న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా విధుల్లో పాల్గోన్న హెల్త్‌ సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు అలవెన్స్‌ లభించలేదు. అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ (సి ఐ టి యు) అనుబంధ సంఘం నేతలు ఐ సి డి ఎస్‌ పీడిని కలిసి అధికారికంగా డ్యూటి లు వేసి, ఎన్నికల అలవెన్స్‌ లు ఇవ్వాలని కోరడం జరిగింది. అయిన జిల్లా అధికారులు ఆశాలకు, అంగన్వాడీ వర్కర్స్‌ కి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉండి సేవలు అందించాలని ఆదేశాలు జారి చేసి, ఫోన్‌ లు ద్వారా సమాచారం ఇచ్చి డ్యూటి చేయించారు.

సోమవారం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. ఆయా కేంద్రాల వద్ద ఆశా వర్కర్లకు, అర్బన్‌ పిహెచ్సిల్లో పని చేసే సెకండ్‌ ఎఎన్‌ఎంలకు డ్యూటీలు వేశారు. అంగన్వాడీ కార్యకర్తలు,ఆయా లు ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైన మాక్‌ పోలింగ్‌ నుండి సాధారణ పోలింగ్‌ పూర్తయిన అర్ధరాత్రి వరకూ కేంద్రాల వద్ద హెల్త్‌ సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 తర్వాత కూడా బూత్‌ల వద్ద సేవలందించారు. ఇతర సిబ్బంది అందరికీ అలవెన్స్‌ అందిస్తున్న అధికారులు ఆశాలకు, అంగన్వాడీలను మాత్రం పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకూ సేవలందించినా అలవెన్స్‌ ఎగ్గొట్టడం దారుణమనే విమర్శలు విన్పిస్తున్నాయి. చాలా పోలింగ్‌ కేంద్రాల వద్ద వృద్ధులు, మహిళలు ఎండ వేడిమి తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయారు. వారికి ఆశాలు ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు కలిపి అందజేశారు. చంటి పిల్లలతో వచ్చిన ఓటర్లు పిల్లలను అంగన్వాడీ వర్కర్స్‌ ఓటు వేసి వచ్చే వరకు వారి ఆలనా, పాలన చూశారు.

నగరంలో లంకాపట్నం, కొత్తపేట, మరో మూడు పోలింగ్‌ బూత్‌లలో రాత్రి 11గంటల వరకు పోలింగ్‌ సాగింది. అక్కడ పని చేస్తున్న ఆశావర్కర్‌, అంగన్వాడీ కార్యకర్తలు ఇవిఎంలు బస్సులో బయలుదేరి వెళ్లి అక్కడే విధులు నిర్వర్తించారు. 2019 ఎన్నికల్లో ఆశాలకు కూడా పోలింగ్‌ డ్యూటీ వేసి అలవెన్స్‌ అందించారు. ఈసారి ఎన్నికల్లో నేరుగా డ్యూటీ వేయకుండా మెడికల్‌ క్యాంపు పేరుతో పోలింగ్‌ పూర్తయ్యే వరకూ ఆశాలతో, చిన్న పిల్లలకు సంరక్షణ పేరుతో అంగన్వాడీ లతో పని చేయించారు. ఎన్నికల అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆశాలకు, అంగన్వాడీ సిబ్బందికీ అలవెన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

➡️