- మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్ : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మంచిగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారని, అయితే రాష్ట్రానికి ఆయన ఏమి తీసుకొచ్చారో చెప్పాలని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలులోని ఎస్‌వి కాంప్లెక్స్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12 మంది ఎంపిలు ఉన్న బీహార్‌కు ఎక్కువ నిధులు ఇచ్చారని, 16 మంది ఎంపిలున్న టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏం తెచ్చిందని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుకు కావాల్సింది అప్పులు కాదని, సొంత గని అని తెలిపారు. అప్పు తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం పండగ చేసుకుంటోందని విమర్శించారు. చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేయాలని, రాజకీయాలు చేయొద్దని కోరారు. బీహార్ కోసం మకాన బోర్డు, నేషనల్ ఫుడ్, విమానాశ్రయాలు అభివృద్ధి, మిధునాల్ ప్రాంతానికి కెనాల్, ఐఐటి అభివృద్ధి చేస్తున్నారని, టిడిపి కూటమి ప్రభుత్వం ఏం అభివృద్ధి సాధించిందని ప్రశ్నించారు. 150 అడుగులు నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ. ఐదు వేల కోట్లు తీసుకొచ్చారని తెలిపారు. 2017 సంవత్సరంలో టిడిపి ప్రభుత్వం తప్పిదం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో నాలుగు పోర్టులను ప్రారంభిస్తే వాటి అభివృద్ధికి నిధులు ఎందుకు తేలేదో సమాధానం చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.